బొప్పాయి అమ్మకాల విషయంలో రైతులకు, దళారులకు మధ్య గొడవ..?

 

హైదరాబాద్ కొత్తపేట పండ్ల మార్కెట్ లో ఉద్రిక్తత నెలకొంది. బొప్పాయి అమ్మకాల విషయంలో రైతులకు, దళారులకు మధ్య గొడవ జరిగింది. బొప్పాయి పండ్లను దళారులకు ఇవ్వకుండా రైతులు నేరుగా అమ్మకాలు జరుపుతున్నారు. అమ్మకాలను అడ్డుకున్న దళారులు రైతులపై దాడి చేశారు, బొప్పాయిలు తమకే అమ్మాలని బెదిరింపులకు దిగారు. దళారుల బెదిరింపులకు రైతులు తలొగ్గకుండా వారిపై ప్రతిదాడికి దిగారు. దళారుల దాడులు, రైతుల ప్రతిదాడులతో మార్కెట్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

డెంగ్యూ ఫీవర్ విజృంభనతో బొప్పాయి విక్రయాలు నగరంలో భారీగా పెరిగాయి. కిలో బొప్పాయి వంద రూపాయలు పలుకుతోంది. డెంగ్యూ ఫీవర్ వస్తే ప్లేట్ లెట్స్ పడిపోతున్నాయని అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ ప్లేట్ లెట్స్ ను పెంచుకోవటానికి బొప్పాయి పండ్లు, అదే విధంగా బొప్పాయి ఆకులను జ్యూస్ చేసుకుని తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయనే ఒక ప్రచారముంది. ఈ నేపథ్యంలో బొప్పాయి అమ్మకాల, కొనుగోలు పెద్ద ఎత్తున పెరగటంతో రైతులు పెద్ద ఎత్తున పండించిన బొప్పాయి పంటను కొత్తపేట మార్కెట్లోకి తీసుకొచ్చి విక్రయాలను జరుపుతుండగా, దళారులు వచ్చి తమకు తక్కువ ధరకు అమ్మాలని డిమాండ్ చేయటంతో రైతులు డైరెక్టుగా కొనుగోలు దారులకే అమ్మకాలు జరపటం జరిగింది. దీంతో ఆగ్రహం చెందిన దళారులు రైతులపై దాడులు చేయటం జరిగింది. ఈ దాడిలో నలుగురు రైతులు గాయపడ్డారు. రైతులపై దాడికి పాల్పడటంతో వారంతా కలిసి దళారులపై ప్రతి దాడికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పరిస్థితిని చక్కపెట్టేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు.