గొర్రెలు, మేకల సరఫరా నిలిచిపోవ‌డంతో పెరిగిన మ‌ట‌న్ ధ‌ర‌!

లాక్ డౌన్ నేపద్యంలో రాష్ట్రంలో మాంసం, చికెన్, చేపల లభ్యతపై మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో చేవెళ్ళ పార్ల‌మెంట్ స‌భ్యులు రంజిత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, శాస‌న‌స‌భ్యులు ముఠా గోపాల్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్, జి.హెచ్‌.ఎం.సి. చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ అబ్దుల్ వకిల్ పాల్గొన్నారు.

పశుసంవర్ధక శాఖ , మత్స్య శాఖ, పోలీసు, రవాణా శాఖ అధికారులతో జిల్లా స్థాయిలో కో ఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేసి నోడల్ అధికారిని నియమించాల‌ని ఈ స‌మావేశం నిర్ణ‌యించింది.

లాక్ డౌన్ కారణంగా జిల్లాల నుండి గొర్రెలు, మేకల సరఫరా నిలిచినా కారణంగానే మటన్ ధరలు పెరిగాయి. మాంసం విక్రయించే దుకాణాల పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకోనున్నారు. 

కూరగాయలు, పాలు, పండ్లు, కోళ్ళు, గ్రుడ్లు తదితర నిత్యావసర వస్తువుల సరఫరా కు ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇచ్చింది. గొర్రెలు, మేకలు పెంపకం దారులు తమ జీవాలను ఆయా జిల్లాలలో, జంట నగరాలకు తీసుకొచ్చి విక్రయించుకునే విధంగా అనుమతుల కోసం  అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మత్స్యకారులు చేపలను  రవాణా చేసుకొనేందుకు, విక్రయించు కునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్న‌ట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్ నుండి జిల్లాల కు వెళ్ళి చేపలు తీసుకొచ్చే వాహనాలకు అనుమతులు మంజూరు చేయడం జరుగుతుంది. సైజుకు వచ్చిన చేపలను పట్టుకొని విక్రయించు కునేలా మత్స్యకారులకు అనుమతులు ఇవ్వ‌నున్నారు.

రవాణా చేసే వస్తువులను తెలిపేలా వాహనాలకు తప్పని సరిగా పోస్టర్లను ఏర్పాటు చేయాలి.  చికెన్ దుకాణాలలోని వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తరలించేలా జిఎచ్ఎంసి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన‌ట్లు మంత్రి తెలిపారు.