రోడ్డెక్కిన మేయర్ అభ్యర్థులు

 

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలలో రెండు ప్రధాన పార్టీల మేయర్ అభ్యర్థులు ఇద్దరూ రోడ్డెక్కారు. అయితే వీళ్లిద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకోలేదు.. అధికారుల మీదే మండిపడ్డారు. రెండు వేర్వేరు కారణాలతో వీళ్లు ఆందోళన చేయాల్సి వచ్చింది. 39వ వార్డులో ఓటు వేసేందుకు వెళ్లిన టీడీపీ మేయర్ అభ్యర్థి పంకం రజనీ శేషసాయికి ఓటు లేదని చెప్పడంతో ఆందోళనకు దిగారు. ఓటరు స్లిప్‌లు లేకపోవడంతో ఓటర్లు చాలా మంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయారని ఆమె అన్నారు. కార్పొరేషన్ సిబ్బంది స్లిప్‌లు పంపిణి చేస్తామన్నా, సగం మందికి మాత్రమే వచ్చాయని, మిగిలిన సగం మందికి స్లిప్‌ లు రాలేదని రజనీ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఓటర్లు 960 మంది ఆగిపోయినట్లు ఆమె తెలిపారు. ఇక్కడ ఎవరూ సహకరించడం లేదని రజనీ శేషసాయి పేర్కొన్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తప్పును సరిచేయడంతో ఆమె మాత్రం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

మరోవైపు, వైఎస్ఆర్ సీపీ మేయర్ అభ్యర్థిని షర్మిలారెడ్డి భర్త అనిల్ రెడ్డి ఓటు వేసేందుకు వెళ్లగా ఈలోపే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అల్లర్లు జరుగుతాయని తమకు అనుమానం ఉండటంతో ఆయనను ముందు జాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే ఎంత సేపటికీ అనిల్ రెడ్డిని వదలకపోవడంతో షర్మిలారెడ్డి, ఇతర నాయకులు వన్ టౌన్ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డుమీదే కూర్చుని చాలాసేపు ధర్నా చేశారు. అనిల్ ఉంటే ఓటింగ్ బాగా జరుగుతుందన్న దుగ్ధతో టీడీపీ నాయకుడు బుచ్చయ్య చౌదరి ఇలా చేయించారని షర్మిలారెడ్డి ఆరోపించారు.

 

మొత్తమ్మీద ప్రధాన పార్టీల అభ్యర్థినులు ఇద్దరూ అధికారుల వైఖరి మీద ముందుగానే మండిపడుతూ ఆందోళనలు చేశారు. వీళ్లిద్దరిలో ఎవరు మేయర్ అయినా, తర్వాతి కాలంలో రాజకీయాలు, పాలన ఎలా ఉంటాయోనని ప్రజలు చెవులు కొరుక్కోవడం కనిపించింది.