ప్రధానిని చేయమన్న మాయావతి

 

అనేక కుంభకోణాలలో సిబిఐ విచారణలు, కోర్టు కేసులు ఎదుర్కొంటున్న బహుజన్ సమాజ్ వాది పార్టీ అధినేత్రి మరియు మాజీ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి నిన్న నాగపూర్ లో జరిగిన పార్టీ ర్యాలీలో తన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికలలో మీరు మన పార్టీని భారీ మెజార్టీతో గెలిపించించాలి. అప్పుడే నేను ప్రధాన మంత్రిగా ఎర్రకోట నుండి జాతినుద్దేశించి ప్రసంగించగలను. నా కల సాకారం అవ్వాలంటే దానికి మీ అందరి మద్దతు చాల అవసరం ఉంది. రానున్న ఎన్నికలలో మీరంతా కలిసికట్టుగా కష్టపడి పనిచేసి మన పార్టీని గెలిపించితే, అధికారం మన స్వంతం కావడం ఖాయం. ఇతర పార్టీలు వేసే ఎరలకు ఆశపడకుండా అందరూ కలిసి కష్టపడి మన పార్టీని గెలిపించుకోవాలి.”

 

ఇటువంటి స్వార్దపరులయిన నేతలు కూడా దేశంలో అత్యున్నతమయిన ప్రధాన మంత్రి పదవిని ఆశిస్తున్నారంటే అందుకు కారణం రెండు ప్రధాన జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు క్రమంగా తమ ప్రాభల్యం కోల్పోతూ, తమ మనుగడకోసం ప్రాంతీయ పార్టీలపై ఆధారపడవలసి రావడమే అని చెప్పవచ్చును. రోజుకో కొత్త కుంభకోణంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంటే, సరయిన దిశానిర్దేశం లేక భారతీయ జనతా పార్టీ చతికిలబడింది. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా దేశంలో మూడో పార్టీ లేకపోవడం వల్ల, క్రమంగా కేంద్రంలో ప్రాంతీయ పార్టీల పెత్తనం పెరుగుతూ వచ్చి, చివరికి జాతీయ పార్టీలను శాసించే స్థాయి నుండి, వాటిని వెనక్కు నెట్టి తామే చక్రం తిప్పే స్థాయికి ఎదిగాయి. తత్ఫలితమే, లాలూ, మాయావతి, చౌహాన్ వంటి ప్రాంతీయ నేతలు తాము కూడా ప్రధాన మంత్రి పదవికి అర్హులమేనని భావించేలా చేస్తున్నాయి.

 

ప్రాంతీయ పార్టీ నేతలు జాతీయ స్థాయిలో చక్రం తిప్పకూడదని నియమేమీ లేకపోయినా, అవినీతికి మారుపేరుగా నిలిచి, రాష్ట్రాలను అన్ని విధాలుగా భ్రష్టుపట్టించిన రాజకీయ నేతలు, కేంద్రంలో కీలక బాధ్యతలు చేపడితే ఇక దేశాన్ని ఎక్కడికి తీసుకుపోతారో ఊహించడమే కష్టం. కనుక ప్రధానమంత్రి వంటి కీలక పదవులకు నిష్కళంక చరితులను ఎన్నుకోవడం ఆవశ్యకం అవుతుంది.