మర్కజ్ నిజాముద్దీన్ ఘటన వెనుక వాస్తవాలివే.. పరిస్ధితి ఎందుకు చేదాటిపోయిందంటే..

వందేళ్ల చరిత్ర కలిగిన మర్కజ్ నిజాముద్దీన్ ఏటా సమావేశాలు నిర్వహిస్తుంటుంది. చర్చలు, నమాజులు వంటి కార్యక్రమాలు ఇక్కడ సర్వసాధారణం. దేశ విదేశాల నుంచి ఇక్కడికి హాజరయ్యే వారి కోసం ఏటా సమావేశాల తేదీలను ముందే ఖరారు చేస్తారు. ఈసారీ తేదీలు ముందే ఖరారు అయ్యాయి. కానీ 21న ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ పిలుపుతో మధ్యలోనే ఆపేశారు. అప్పటికే వివిధ దేశాలతో పాటు రాష్ట్రాల నుంచి వచ్చిన ముస్లింలు సమావేశాల్లో బిజీగా ఉన్నారు. 

జనతా కర్ఫ్యూ నేపథ్యంలో జమాత్ ను అర్ధాంతరంగా రద్దు చేసుకున్న మర్కజ్ రాత్రి 9 గంటల వరకూ ఎవరినీ బయటికి పంపలేదు. తర్వాత అదే రోజు రాత్రి ఢిల్లీ ప్రభుత్వం ఈ నెల 31 వరకూ లాక్ డౌన్ ప్రకటించింది. జనతా కర్ఫ్యూ ముగిసినా, తర్వాత రోజు ఉదయం లాక్ డౌన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అర్ధరాత్రి పలువురు విదేశీయులు వెళ్లిపోయారు. కానీ దేశీయంగా ఉన్న వారు మాత్రం పూర్తిగా వెళ్లలేకపోయారు. అప్పటికే కొందరు విదేశీయుల్లో కరోనా లక్షణాలు ఉండటంతో వారు ఇతరులకు అంటించారు. 

లాక్ డౌన్ ఉన్నందున అక్కడే ఉండిపోయిన వందలాది మందిని ఖాళీ చేయాలని స్ధానిక అధికార యంత్రాంగం మధ్యలో నిర్వాహకులకు నోటీసులు ఇచ్చింది. లాక్ డౌన్ ఉన్నందున స్వస్ధలాలకు వెళ్లేందుకు వీలుగా వీరికి పాస్ లు మంజూరు చేయాలని మర్కజ్ నిర్వాహకులు కోరడంతో అధికారులు 17 వాహనాలకు అనుమతి ఇచ్చారు. అయినా కొందరు వెళ్లలేకపోయారు. 28న అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించాగా.. వీరిలో కొందరిలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వీరిని క్వారంటైన్ కు పంపారు. లాక్ డౌన్ నిబంధనలు ఉండగానే మర్కజ్ లో జనం మర్కజ్ లో ఉండటంపై ఫేస్ బుల్ లో పోస్టులు వెలిశాయి. దీంతో కేజ్రివాల్ సర్కారు చర్యలకు ఉపక్రమించింది. అయితే లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి ప్రభుత్వాధికారులతో చర్చిస్తున్నట్లు మర్కజ్ సమాధానం ఇచ్చింది. అయితే ఆ తర్వాత కేజ్రివాల్ సర్కారు చర్యలకు ఆదేశించడంతో మర్కజ్ ఇవాళ మరోసారి వివరణ ఇచ్చింది. విదేశీయులకు కరోనా పరీక్షలు నిర్వహించకపోవడంతో పాటు వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ ప్రటకన తర్వాత వెంటనే పంపకపోవడమే కొంప ముంచినట్లు తెలుస్తోంది.