మైనింగ్ వివాదం.. ఎరవేసి ప్రాణం తీశారు

 

మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన అరకు ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యేలపై నక్సలైట్ల దాడి ఎలా జరిగిందనే విషయంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. వీరు తమ మైనింగ్ క్వారీల వద్దకు వెళుతుండగా మావోయిస్టులు దాడి చేసి చంపేశారని తొలుత ప్రచారం జరగగా, ఆ తరువాత వీరు గ్రామదర్శినిలో పాల్గొనేందుకు వెళుతుండగా మావోల దాడి జరిగిందని వార్తలు వచ్చాయి. అయితే అసలు వాస్తవం వేరని వీరిని మావోలే ఒక పథకం ప్రకారం తమవద్దకు రప్పించుకొని ఆ తరువాత వీరిని మట్టుబెట్టారని పోలీసు వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ వ్యూహాన్నే 'బెయిటెడ్‌ ఆంబుష్‌' అంటారని వారు చెబుతున్నారు. బెయిటెడ్‌ ఆంబుష్‌’... అంటే ఎరవేసి మట్టుపెట్టడం! ఆ ‘ఎర’ ఏ రూపంలోనైనా ఉండొచ్చు. ఒక చిన్నపాటి ఘటనకు పాల్పడి, దానిపై ఆరా తీసేందుకు వచ్చిన బలగాలను మట్టుపెట్టి పెను విధ్వంసానికి పాల్పడవచ్చు. లేదా... గిరిజనుల రూపంలో అభ్యర్థనలు పంపించి, అక్కడికి వచ్చిన జవాన్లను మట్టుపెట్టవచ్చు. ఇదే... బెయిటెడ్‌ ఆంబుష్‌. ఇందులో మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్‌కే అలియాస్‌ అక్కిరాజు హరగోపాల్‌ దిట్ట. గత ఏడాది మే 12న బస్తర్‌లో సీఆర్‌పీఎఫ్‌ బలగాలను బెయిటెడ్‌ ఆంబు్‌షలోనే ఉచ్చులోగి లాగారు. ఈ ఘటనలో 25 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం విశాఖ మన్యంలోనూ అధికార పార్టీకి చెందిన నేతలను మాట్లాడుకుందాం అనే ఎర వేసి మట్టుపెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. మిలీషియా సభ్యులు వస్తారని అంచనా వేయని ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇద్దరూ ఉచ్చులో చిక్కారని పోలీసులు అంటున్నారు.

మైనింగ్‌ వివాదమే వీరి ప్రాణాలను బలితీసుకున్నట్లు తెలుస్తోంది.కిడారి, సోమ ఇద్దరూ ప్రత్యక్షంగా, పరోక్షంగా గనుల వ్యాపారంలో ఉన్నారు. సోమ ఓ గనిని మరొకరి పేరిట లీజుకుతీసుకొని భారీగానే పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. అయితే, అక్కడ తవ్వకాలు జరపొద్దని మావోయిస్టులు సోమను హెచ్చరించారు. ఎమ్మెల్యేను కూడా లేటరైట్‌ విషయంలో నాలుగుసార్లు హెచ్చరించినట్లు తెలిసింది. అయితే, బయట అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టామని, మైనింగ్‌ నిలిపివేస్తే తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతుందని వీరు ఆందోళన చెందుతున్నారు.ఈ క్రమంలో మావోయిస్టులను ప్రసన్నం చేసుకునేందుకు తాను సహకరిస్తానంటూ ఏజెన్సీకే చెం దిన ఓ వ్యక్తి ముందుకొచ్చాడు. ‘ఇప్పటికే వారి నుంచి హెచ్చరికలు అందుకున్నాం కదా.. ఎంతకాలమని దీనిని నాన్చుతాం.. అప్పులు పెరిగిపోతున్నాయి.. ఈ సమస్య పరిష్కారమైతే బాధలు తీరిపోతాయి' అని నేతలు భావించి వెళ్లినట్టు తెలుస్తోంది. మావోయిస్టులు వీరిని మాటల పేరిట తీసుకుకెళ్లి మట్టుపెట్టారు.