ముందస్తు ఎన్నికలపై మావోల బహిరంగ లేఖ

 

తెలంగాణలో 9 నెలల ముందే కేసీఆర్‌ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నది తెలిసిందే.అలాగే ఆజన్మ శత్రువులుగా ఉన్న టీడీపీ,కాంగ్రెస్ పార్టీలు తెరాస ని గద్దె దింపాలనే లక్ష్యంతో పొత్తులో భాగంగా మహాకూటమిగా ఏర్పడినది కూడా విదితమే.మహాకూటమిలోని పార్టీలు , తెరాస పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.అధికార,ప్రతిపక్ష పార్టీలు కాబట్టి విమర్శలు చేసుకోటంలో కొత్త ఏం లేదు.కానీ అనూహ్యంగా మావోయిస్టులు ముందస్తు ఎన్నికలు,పొత్తుపై బహిరంగ లేఖ విడుదలచేసి సంచలనం రేపారు.

బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్‌ పేరుతో లేఖ విడుదలైంది.కేసీఆర్‌ సర్కార్‌ దోపిడీ, అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో హామీలు నెరవేర్చలేదని, తెలంగాణ జన సమితి చేస్తున్న అవకాశవాద రాజకీయాలను నిరసించాలని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన రాజకీయపార్టీలతో కాంగ్రెస్‌ పొత్తా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామిక తెలంగాణ లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తామని లేఖలో హరిభూషణ్ స్పష్టం చేశారు.కుల వివక్ష, పరువు హత్యలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ధర్నాచౌక్ ను పునరుద్ధరించి ప్రజల ప్రాథమిక హక్కులను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.