తెలంగాణలో ఎన్నికలపై మావోయిస్ట్ ఎఫెక్ట్

 

గతంలో మావోయిస్టులు తెలంగాణలో,చత్తీస్‌ఘడ్ లో ఎన్నికలను బహిష్కరించాలని హెచ్చరించిన విషయం విదితమే.కాగా తాజాగా చత్తీస్‌ఘడ్ లో తొలి దశ పోలింగ్ జరిగింది.అయితే ఎన్నికలకు ముందు మావోలు రెచ్చిపోయారు.పోలింగ్‌ ప్రారంభం కావడానికి కొద్ది గంటల ముందే మావోయిస్టులు బాంబు దాడికి దిగారు.పోలింగ్‌ విధుల నిమిత్తం వెళ్తున్న భద్రతాసిబ్బంది, ఎన్నికల అధికారులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు.అయితే దాడిలో ఎలాంటి ప్రాణహాని జరగలేదు.అంతేకాకుండా పోలింగ్ కు ముందు రోజు కూడా ఐఈడీ బాంబుతో దాడికి దిగారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ సీఆర్‌పీఎఫ్ జవాను చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.రెండు వారాల్లో ఏడు సార్లు మావోయిస్టులు ఐఈడీ దాడులకు పాలపడ్డారు.ఈ దాడుల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.అయితే ప్రస్తుతం మావోయిస్ట్ యాక్షన్ టీమ్స్ తెలంగాణ జిల్లాల్లో సంచరిస్తున్నట్లు పోలీస్ నిఘా వర్గాలకు సమాచారం అందింది.

చత్తీస్‌ఘడ్ నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల్లోకి ప్రవేశించినట్లు తెలుస్తుండగా  ప్రధానంగా జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల్లో యాక్షన్ టీమ్ సభ్యుల కదలికలున్నట్లు గుర్తించారు. మావోయిస్టు యాక్షన్ టీమ్స్ ప్రవేశించారన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు హిట్ లిస్టులో ఉన్న నేతలను అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు సమాచారం. అలాగే తమకు సమాచారమివ్వకుండా ప్రచారాల పేరుతో మారుమూల గ్రామాలకు వెళ్లొద్దంటూ నేతలకు ఆదేశిలిచ్చారని తెలిసింది. ఇదిలా ఉండగా యాక్షన్ టీమ్స్ ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.అయితే చత్తీస్‌ఘడ్ ఎన్నికల వేళ అలజడి సృష్టించిన మావోయిస్టులు తెలంగాణలో సంచరిస్తున్నారంటే ఇక్కడ ఎన్నికల సమయంలో ఎటువంటి బీభత్సవం సృష్టిస్తారో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.