తెలంగాణ భవన్ వద్ద ఆందోళన

 

ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలలో అసంతృప్తి తారాస్థాయికి చేరుతుంది. కూటమిలోని పార్టీలు కాంగ్రెస్, టీడీపీ ఇంకా అభ్యర్థులను అధికారంగా ప్రకటించకుండానే పలు నియోజకవర్గాల్లోని కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. రీసెంట్ గా గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు, ఎన్టీఆర్ భవన్ వద్ద టీడీపీ కార్యకర్తలు ఏ స్థాయిలో నిరసన వ్యక్తం చేసారో తెలిసిందే. అయితే తాజాగా ఈ నిరసన సెగ తెలంగాణ భవన్ కి కూడా తగిలింది. ఖైరతాబాద్ టిక్కెట్‌ను దానం నాగేందర్‌కు ఇవ్వద్దంటూ మన్నె గోవర్ధన్ రెడ్డి వర్గీయులు తెలంగాణ భవన్ ముందు ఆందోళనకు దిగారు. ఖైరతాబాద్ టిక్కెట్ మన్నె గోవర్ధన్ రెడ్డికే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్‌కు జై కోడుతూ దానంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుందని, కేసీఆర్ ముక్కు పట్టుకుని నేలకు రాస్తామని అన్నవారికి టిక్కెట్ ఇవ్వడం ఎంతవరకు సబబని కార్యకర్తలు ప్రశ్నించారు. దానం తెలంగాణ ద్రోహి అని, ఉద్యమంలో పాల్గొనలేదని వారు ఆరోపించారు.