మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే అరెస్ట్!!

రాజధానిని అమరావతి నుండి తరలించవద్దని రాజధాని ప్రాంత రైతులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి టీడీపీ, జనసేన వంటి పార్టీలు అండగా నిలుస్తున్నాయి. ఇదిలా ఉంటే అధికార పార్టీ వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే మాత్రం రాజధానిగా అమరావతి వద్దంటూ ఆందోళన చేపట్టారు.
 
రాజధానిగా అమరావతి వద్దని, అధికార వికేంద్రీకరణ జరిగి, సమగ్ర అభివృద్ధి జరిగితేనే ఏపీ అన్ని రంగాల్లో ముందంజ వేస్తుందని చెబుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈరోజు ఉదయం గుంటూరు జిల్లా పెనుమాక నుంచి తాడేపల్లి భరతమాత విగ్రహం వరకు భారీ ర్యాలీ తలపెట్టారు. అయితే ఆయనను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.

భారీ సంఖ్యలో మద్దతుదారులతో ఆయన బయలుదేరగా.. ఈ ప్రాంతంలో ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు తొలుత హెచ్చరించారు. అయినా వినకపోవడంతో... నిషేధాజ్ఞలను ఉల్లంఘించారంటూ ఆర్కేను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌ కు తరలించారు. ఆయనకు మద్దతుగా వచ్చిన స్థానిక వైసీపీ నాయకులను కూడా పోలీసులు స్టేషన్ కు తరలించారు.