మంచిర్యాలలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సన్నాహం.. క్రెడిట్ బీజేపీకేనా?

పెద్దపల్లి జిల్లా పరిధిలోని రామగుండం నియోజక వర్గం పరిశ్రమలకు పుట్టినిల్లు. ఇక్కడి కార్మికులు.. ప్రజల కోసం ప్రత్యేకంగా ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఎప్పటి నుండో ఉంది. రాజకీయ పార్టీల ఎన్నికల హామీల్లో ఇది కూడా ప్రధానమైనదే. కాకపోతే ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీ వ్యవహారం ఆ ప్రాంత నేతలకు పెద్ద ప్రెస్టీజ్ ఇష్యూగా మారింది. ఇక్కడ పనిచేసి ఆర్థిక స్తోమత లేని పేద, మధ్య తరగతి ప్రజలు ప్రభుత్వం అందించే వైద్యం పైనే ఆధారపడుతూ ఉంటారు.

సింగరేణి, ఎన్టీపీసీ, బసంతనగర్ సిమెంట్ పరిశ్రమలకు అనుబంధంగా ఆసుపత్రులు ఉన్నప్పటికీ ఆయా సంస్థల్లో పని చేసే వారికి మాత్రమే వాటిలో వైద్యం అందిస్తారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి ఆనుకొని మంథని, మంచిర్యాల, చెన్నూరు, పెద్దపల్లి, ధర్మపురి నియోజకవర్గాలుంటాయి. ఈ ప్రాంతాల నుంచి అత్యవసర కేసులు రామగుండంలోని ఆసుపత్రులకు రిఫర్ చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మెడికల్ కళాశాల ఆవశ్యకత పెరిగింది. ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా దాదాపు 6 నియోజక వర్గాల ప్రజలకు వైద్యాన్ని అందించే వీలుండటంతో ఈ డిమాండ్ పెరుగుతూ వచ్చింది. ఆ డిమాండ్ కాస్తా ఇప్పుడు ఎన్నికల హామీగానే మారిపోతోందని జనాలు అనుకుంటున్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరి ఖనిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ రామగుండంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసే బాధ్యత తనదంటూ హామీ ఇవ్వడంతో అంతా సంబరపడ్డారు. రామగుండం ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కావలసిన వసతులు , సౌకర్యాలు ఉన్నాయని సింగరేణి ఎన్టీపీసీ సంస్థల సహకారంతో  స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సీఎం కేసీఆర్ దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లారు. సీఎం హామీతో పాటు ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందని అనుకుంటున్న తరుణంలోనే ఊహించని పోటీ మొదలయ్యింది. ఇటీవల పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ మెడికల్ కళాశాల మంచిర్యాల జిల్లాలో ఏర్పాటు చేయాలంటూ కేంద్రంలో ఉన్న బిజెపి నాయకులకు వినతి పత్రాలు ఇవ్వడం మొదలు పెట్టారు.

అనూహ్యంగా మంచిర్యాల జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని వివేక్ అడుగుతున్నారని ఇప్పుడు చర్చ మొదలైంది. దీని వెనుక కారణం ఏమై ఉంటుందా అని జనాలు ఆలోచనలో పడ్డారు. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది. మెడికల్ కళాశాల ఏర్పాటుకు కేంద్రమే అనుమతులివ్వాలి. అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఆ క్రెడిట్ దక్కకుండా చేయడంతో పాటు తానే సాధించాను అని జనం ముందు చెప్పుకోవచ్చని వివేక్ భావిస్తున్నారని జనాల్లో టాక్. రామగుండం ఎమ్మెల్యే చందర్ మాజీ ఎంపీ వివేక్ లకు తానేమి తక్కువ కాదంటూ పోటీలోకి దిగారు చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్. తన నియోజకవర్గంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి పాటుపడాలంటూ సుమన్ విన్నపాలు మొదలుపెట్టారు. రామగుండం, చెన్నూరు నియోజక వర్గాల శివారు మెడికల్ కళాశాల ఏర్పాటుకు అనువైన స్థలం అంటూ సుమన్ తన నియోజకవర్గానికి ప్రాధాన్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ముగ్గురు నేతలు తలా ఒక చోట మెడికల్ కళాశాలను ప్రతిపాదిస్తూ ఉండడంతో అసలు ఈ పని అవుతుందా లేదా అనే అనుమానంలో జనం పడిపోయారు. ఇలా చందర్, సుమన్, వివేక్ ఎవరికి వారే మెడికల్ కళాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రస్తుతం చెన్నూరు నియోజక వర్గం మంచిర్యాల జిల్లాలోనే ఉంది. అంటే వివేక్ కోరినట్టు మంచిర్యాల జిల్లాలో ఏర్పాటైనట్టు అవుతుంది. అలాగే సుమన్ కోరుకున్నది అయిపోతుంది. కాబట్టి సుమన్ కోరినట్టు చెన్నూరు లోనే చివరకు ఈ కళాశాల ఏర్పాటైన ఆశ్చర్యపోవలసిన పనిలేదు అంటున్నారు. మరి వివేక్ ప్రయత్నం ఫలిస్తుందో సీఎం కేసీఆర్ హామీ నెరవేరుతుందో చూడాలి అని జనాలు అనుకుంటున్నారు.