మమత, ఉమాభారతి : లేడీ లీడర్లకి తప్పిన గండాలు!

 

గురువారం ఇద్దరు లేడీ లేడర్లు తృటిలో గండాల నుంచి బయటపడ్డారు. వారిలో ఒకరు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మరొకరు బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమాభారతి. బెంగాల్‌లోని మాల్దాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి మమతా తాను బస చేసిన హోటల్‌ రూమ్‌లో వుండగా గురువారం సాయంత్రం గదిలో వున్న ఏసీకి నిప్పంటుకుని గది నిండా పొగలు వ్యాపించాయి. మమత పెద్దగా కేకలు వేయడంతో ఆమె సహాయకులు ఆమెని సురక్షితంగా బయటకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం కారణంగా మమతకు ఎలాంటి గాయాలూ తగల్లేదు. అయితే ఈ ప్రమాదం వెనుక కుట్ర వుందన్న అనుమానాలను మమత పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా వుంటే భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకురాలు ఉమాభారతి యు.పి.లోని ఝాన్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర్ ప్రదేశ్‌లో హెలికాప్టర్‌లో తిరుగుతున్నారు. అయితే గురువారం నాడు ఉమ ఎక్కిన హెలికాప్టర్ అంతు చిక్కకుండా పోయింది. యుపిలోని రాజ్‌ఘాట్ నుంచి కళ్యాణపుర గ్రామానికి వెళ్లాల్సి వున్న హెలికాప్టర్ దారితప్పి మధ్యప్రదేశ్‌లోని శివపురి ప్రాంతానికి వెళ్ళిపోయింది. వాతావరణం బాగాలేకపోవడంతో అక్కడే దిగింది. రావలసిన హెలికాప్టర్ సమయానికి రాకపోవడంతో అధికారులు టెన్షన్ పడిపోయారు. చివరికి హెలికాప్టర్, ఉమ సురక్షితంగా వున్నారని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా వుంటే హెలికాప్టర్‌కి సరిగా సిగ్నల్ ఇవ్వకపోవడం వల్లే ఇలా జరిగిందని, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కావాలనే ఇలా చేసిందని భారతీయ జనతాపార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.