కాంగ్రెస్ కు మరో షాక్

 

భారతీయ జనతా పార్టీని గద్దె దింపేందుకు సన్నాహాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అనుకోని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.2019 లోక్ సభ ఎన్నికల్లో దేశంలోని పలు పార్టీలతో జట్టు కట్టి బీజేపీ పై పోరాటానికి దిగుదామనుకుంది.ప్రతి పక్షాలన్నీ ఏకతాటిపై ఉన్నాయంటూ ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కి బీఎస్పీ అధినేత మాయావతి షాక్ ఇచ్చింది.కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించి కాంగ్రెస్ పార్టీని సందిగ్ధంలో పడేసింది.ఈ షాక్ నుంచి తేరుకునేలోపే పశ్చిమ్‌బంగా అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా కాంగ్రెస్ పార్టీ తో కలిసి పోటీ చేయవల్సిన అవసరంలేదని ఊహించని షాక్ ఇచ్చింది.'పశ్చిమ్‌ బంగాలో భాజపా, వామపక్ష పార్టీలకు వ్యతిరేక శక్తిగా మమతా బెనర్జీ మాత్రమే ఉన్నారు.కాంగ్రెస్‌తో పాటు ఏ పార్టీతోనూ కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లేదు’ అని ఆ పార్టీ నేత చందన్‌ మిత్రా  వ్యాఖ్యానించారు.కాంగ్రెస్‌తో కలిసి మమతా బెనర్జీ పనిచేయకపోతే భాజపాకే లాభం చేకూరుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఆ రాష్ట్రంలో మొత్తం 42 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. ఈసారి అత్యధిక సీట్లు సాధించాలని భాజపా భావిస్తోంది.