'భారత ఆర్మీ'ని 'మోదీ సేన'గా మార్చారు

 

ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లక్నోలో ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ భారత ఆర్మీని మోదీ సేనగా అభివర్ణించారు. బాలాకోట్‌లో మన వాయుసేన దాడులకు సాక్ష్యాలు కావాలంటూ విపక్షాలు అడుగుతున్నాయని, పుల్వామా ప్రతీకారానికి కుతకుతలాడుతున్న వారిలో ఒకటి పాకిస్థాన్ అయితే, మరొకటి విపక్షాలని విమర్శించారు. ఓ పక్క ఉగ్రవాదుల మృతదేహాలను పాకిస్థాన్ లెక్కపెడుతుంటే, మరోవైపు వాయుదాడులను విపక్షాలు ప్రశ్నించడం సహించరానిదని అన్నారు. గత యూపీఏ ప్రభుత్వం ఉగ్రవాదులకు బిర్యానీలు తినిపిస్తే, 'మోదీ సేన' మాత్రం బుల్లెట్లు, బాంబుల రుచి చూపిస్తోందన్నారు. తరచూ ఎన్నికల సభల్లో భారత సైన్యం గురించి బీజేపీ పదే పదే ప్రస్తావించడం.. ఇప్పటికే వివాదాస్పమైంది. ఇప్పుడు ఏకంగా 'భారత ఆర్మీ'ని 'మోదీ సేన'గా యోగి ఆదిత్యనాథ్‌ అబివర్ణించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి.

ఇదే విషయంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. యోగి ఆదిత్యనాథ్‌ పై విరుచుకుపడ్డారు.ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు. 'ఇండియన్ ఆర్మీని మోదీ సేన అంటూ యూపీ సీఎం మాట్లాడటం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. సైన్యం క్రెడిట్‌ను తమకు ఆపాదించుకోవడమంటే సైనిక బలగాలను అవమానించడమే. ఆర్మీ మనకు గర్వకారణం. సైన్యం అందరికీ చెందినది. దేశానికి ఘన సంపద ఆర్మీ. బీజేపీ క్యాసెట్ ఎంతమాత్రం కాదు. యోగి ప్రకటనను దేశ ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలి' అని మమత ఆగ్రహం వ్యక్తం చేసారు.