ఆ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం ఆపేయండి.!!

 

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఉత్కంఠ పోరు కొనసాగింది. చివరకు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి 376 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రీకౌంటింగ్ నిర్వహించాలని మల్‌రెడ్డి రంగారెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు. తాజాగా ఆయన సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ను కలిశారు. తమ నియోజకవర్గంలో రిటర్నింగ్‌ అధికారులు కేటీఆర్‌ ఆదేశాల మేరకు నడుచుకున్నారని, ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి కుమారుడు మొబైల్‌ ఫోన్‌తో ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి వచ్చారని తెలిపారు. 18వ రౌండ్‌ నుంచి తన మెజార్టీ తగ్గించారని ఆరోపించారు. న్యాయంగా గెలవని మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమాన్నినిలిపివేయాలని మల్‌రెడ్డి ఈసీని కోరారు. తనకు ఈసీ న్యాయం చేయకపోతే కోర్టుని ఆశ్రయిస్తానన్నారు. అవసరమైతే ఓట్ల లెక్కింపులో అన్యాయం జరిగిన అభ్యర్థులమంతా కలిసి పోరాటం చేస్తామని మల్‌రెడ్డి హెచ్చరించారు.