భారత్ ఆశ్రయం కోరిన మాల్దీవుల మాజీ దేశాధ్యక్షుడు

 

మాల్దీవుల మాజీ దేశాధ్యక్షుడు మొహమ్మద్ నషీద్, తనపై స్థానిక కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేయడంతో, నిన్నరాజధాని ‘మాలే’లోగల భారత హై కమీషన్ కార్యలయానికి వచ్చి అక్కడ తనకి రాజకీయ ఆశ్రయం ఇప్పించవలసిందిగా భారత హై కమీషనరు డీ.యం.ముల్లెను అభ్యర్దించారు.


నషీద్ 2012వ సంవత్సరంలో స్థానిక క్రిమినల్ కోర్టు ప్రధాన న్యాయ మూర్తిని అరెస్ట్ చేసిన కేసులో, కోర్టు నషీద్ ను స్వయంగా కోర్టులో హాజరయి తన సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ఆడేశించినప్పుడు, ఆయన కోర్టుకు రాకపోవడంతో అయన బెయిలు దరఖాస్తును తిరస్కరిస్తూ, అయన అరెస్ట్ కు ఆదేశాలు జారీ చేసింది. అరెస్ట్ తప్పించుకొనేందుకు, నషీద్ భారత హై కమీషన్ కార్యాలయంలో ఆశ్రయం కోరారు.


అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం, స్వదేశంలో ఉన్న విదేశీ హై కమీషన్ కార్యలయాలలోకి స్థానిక పోలీసులు లేదా రక్షణ అధికారులు కానీ లోనకి ప్రవేశించే వీలులేదు గనుక, నషీద్ భారత కార్యాలయంలో ఆశ్రయం కోరారు. అందువల్ల, ఆయన బయటకు వస్తే, అరెస్ట్ చేసేందుకు మాల్దీవుల పోలీసులు భారత హై కమీషన్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. అయితే, వారు ఎట్టి పరిస్థితుల్లో భారత హై కమీషన్ కార్యాలయములోకి ప్రవేశించబోరని మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు మొహమ్మద్ వహీద్ తెలిపారు.