నోబెల్ పీస్ ప్రైజ్... మోడీ, షరీఫ్‌కి మలాలా ఆహ్వానం

 

భారతదేశం, పాకిస్థాన్ సరిహద్దుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, హింసాత్మక వాతావరణం నెలకొని వుంటే, ఈ రెండు దేశాలకు చెందిన వారికి నోబుల్ శాంతి బహుమతి లభించింది. పాకిస్థాన్‌లో మహిళా చైతన్యానికి కృషి చేస్తున్న బాలిక మలాలా యూసఫ్జాయ్‌కి, భారతదేశంలో బాలల హక్కుల సాధనకు కృషి చేస్తున్న కైలాష్ సత్యార్థికి 2014 సంవత్సరానికి గాను నోబెల్ కమిటీ నోబెల్ శాంతి బహుమతులకు ఎంపిక చేసింది. కైలాష్ సత్యార్థి ఎంతోకాలంగా భారతదేశంలో బాలల హక్కులను కాపాడటానికి తాను స్థాపించిన బచపన్ బాచావో ఆందోళన్ సంస్థ ద్వారా సుదీర్ఘ కృషి చేస్తున్నారు. సత్యార్థి నోబెల్ పురస్కారం అందుకుంటున్న ఏడవ భారతీయుడు. కైలాష్ సత్యార్థి 1990 సంవత్సరం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ చేస్తున్న తన ఉద్యమం ద్వారా దాదాపు 80 వేల మంది బాల కార్మికులకు వెట్టి నుంచి విముక్తి కల్పించారు. ఇదిలా వుంటే, డిసెంబర్‌లో జరిగే నోబెల్ శాంతి బహుమతిని తాను స్వీకరించే కార్యక్రమానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌లకు మలాలా యూసుఫ్ జాయ్ ఆహ్వానం పలికింది.