బాబు కాకుండా మిగిలేది ముగ్గురు ఎమ్మెల్యేలే.. అందుకే గప్ చుప్!!

 

అసెంబ్లీలో చంద్రబాబు కాకుండా టీడీపీకి మిగిలేది ముగ్గురు ఎమ్మెల్యేలేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలకు కారణం ఆ పార్టీ ఎమ్మెల్యేల తీరే అని చెప్పాలి. గెలిచిందే 23 మంది ఎమ్మెల్యేలు అంటే.. వారిలో మెజారిటీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అసలు వారి వాయిస్ నే వినిపించట్లేదు. ఎమ్మెల్యేల వైఖరి పట్ల బాబు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.

అధికారపక్షం వైసీపీ తరఫున అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే.. టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య, రామానాయుడు తప్ప మిగిలిన వారెవరూ పట్టించుకోవడం లేదు. వైసీపీ నేతలు బాబుపై వ్యక్తిగతంగా విమర్శలు చేసినా కూడా పెద్దగా స్పందించడం లేదు. గతంలో అసెంబ్లీలో ఉన్న సమయంలో కరణం బలరామ్, పయ్యావుల కేశవ్‌ వంటి వారు టీడీపీ మీద ఈగ వాలనిచ్చేవారు కాదు. వారి వాగ్ధాటికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఇబ్బందిపడే వారు. అలాంటిది ఇప్పుడు వారి గొంతు అసెంబ్లీలో అసలు వినిపించడం లేదు.

అనవసరంగా వైసీపీకి టార్గెట్ అవ్వడం ఎందుకని కొందరు, టీడీపీలో ఇంకెన్ని రోజులు ఉంటామో తెలీదు ఈ మాత్రం దానికి హడావుడి ఎందుకని మరికొందరు.. సైలెంట్ గా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. వైసీపీకి టార్గెట్ అవుతామనే భయం సంగతి పక్కనబెడితే.. టీడీపీ నుంచి పది మందికి పైగా ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ నేతలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఎలాగూ పార్టీ మారిపోతాం కదా.. ఇప్పుడెందుకు అసెంబ్లీలో చొక్కాలు చించుకోవడం అని బీజేపీ గూటికి చేరాలనుకుంటున్న ఎమ్మెల్యేలు సైలెంట్ అవుతున్నారట. 

కరణం బలరాం, పయ్యావుల కేశవ్, వల్లభనేని వంశీ బీజేపీలో చేరతారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ ముగ్గురూ నోరు విప్పడం లేదట. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నుంచి అసలు స్పందనే లేదు. బీజేపీలో చేరే వారిలో తొలి వ్యక్తి గంటానే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. సీనియర్ నేతలు గొట్టిపాటి రవి, గద్దెరామ్మోహన్, వెలగపూడి రామకృష్ణ బాబు ఎందుకు నోరెత్తడం లేదనేది మరో ప్రశ్న. సాధారణంగా గొట్టిపాటి రవి అసెంబ్లీలో మితంగా మాట్లాడతారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు, తర్వాత వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన పెద్దగా మాట్లాడలేదు. ఇక మంచి వాగ్ధాటి ఉన్న గద్దె రామ్మోహన్ కూడా ఈసారి అస్సలు మాట్లాడటం లేదు. బాబు గురించి అవహేళనగా మాట్లాడుతున్నప్పుడు కూడా గద్దె రామ్మోహన్ స్పందించడంలేదు. వెలగపూడి రామకృష్ణబాబుది కూడా ఇదే తీరు. దీంతో ఎమ్మెల్యేల తీరుపై బాబు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.