హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోలీసులు నిజంగానే ప్రేక్షక పాత్ర వహించారా?

 

హుజూర్ నగర్ ఉప ఎన్నికల పై  వివిధ పార్టీలు చాలా ఆసక్తి చూపించాయి.ఎవరికి తగ్గ రీతిలో తమ దైన శైలిలో ప్రచారాలతో ముందుకుపోయారు పార్టీ నేతలు.ప్రచారల గడువు ముగిసిన తరువాత కూడా అధికారులు ఎంత నిఘా పెట్టినా హుజూర్ నగర్ లో జరగాల్సిన కార్యక్రమం జరిగింది. రాత్రికి రాత్రే ఎవరికి కావాల్సిన సరుకు వారికి చేరిపోయింది. కోట్లాది రూపాయల డబ్బును పార్టీలు పంచేశాయి. పీపాలకు పీపాల మద్యాన్ని తాగించేశాయి. 

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో నోట్ల కట్టలు చేతులు మారాయి. మద్యం ఏరులై పారింది. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున ఖర్చు చేశాయి. ప్రచారం ప్రారంభమైన నాటి నుంచి ఒకెత్తయితే చివరి రెండ్రోజులు ఒకెత్తు అన్నట్టుగా ఓటర్ల కొనుగోలుకు ప్రయత్నించాయి. ఒక్క శనివారం రాత్రే సుమారు ముప్పై ఐదు కోట్లు పంపిణీ చేశారు. హోరాహోరీ తలపడుతున్న రెండు పార్టీలు కేవలం మద్యానికే ఆరు కోట్లు ఖర్చు చేశాయి. మండల స్థాయి నాయకులకు చెక్కుల ద్వారా డబ్బులు అందించగా వారు ముందుగా శనివారం రాత్రికి రాత్రే పంపిణీ పూర్తి చేశారు. మరికొన్ని చోట్ల స్థానిక వ్యాపారులు పెట్టుబడిదారుల వద్ద చేబదులుగా తీసుకుని స్థానిక నేతలకు అందజేశారు. 

మరోవైపు హుజూర్ నగర్ సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఉండడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సేకరించిన డబ్బును వివిధ సంఘాల నేతలు వారి అనుచరులకు అప్పగించారు. వారంతా ఆ కొద్ది మొత్తాన్నే ఆర్టీసీ బస్సులో సామాన్య ప్రయాణికుల మాదిరిగా వచ్చి ఎంచుకున్న ప్రాంతాలకు డబ్బు సంచులను చేరవేశారు. అరవై మంది ఓటర్లకు ఒక ఇన్ చార్జీ చొప్పున నియమించిన ప్రధాన పార్టీలు డబ్బు పంపిణీలో వారిని కీలకం చేశాయి. ఒక ప్రధాన పార్టీ ఓటర్ కు వెయ్యి రూపాయలు పంచగా, మరో పార్టీ ఐదు వందల రూపాయల చొప్పున ఇచ్చింది. మరోవైపు డబ్బులిస్తూనే కొందరు కార్యకర్తలు ఓటర్లతో ప్రమాణం చేయించుకున్నారు. కళ్లేపల్లి మైసమ్మ, దుప్పలపల్లి మైసమ్మ దేవతల వద్ద మొక్కి తెచ్చామని డబ్బులు తీసుకున్న వారు తాము చెప్పిన గుర్తుకు ఓటు వేయాలని లేదంటే ఆ దేవతల ఆగ్రహానికి గురవుతారు అంటూ వారిపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఇంత జరుగుతున్నా అటు ఎన్నికల కమిషన్ సిబ్బంది, ఇటు నిఘా పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారనే విమర్శలు వినపడుతున్నాయి.ఇక పార్టీ నేతల ప్రయత్నాలు సఫలం అయ్యాయో లేదో ఫలితాల నాడే తేలనుంది.