ఇప్పుడు కృష్ణ, మహేష్ అభిమానుల వంతు

 

 

 

చిరంజీవి కాంగ్రెస్ పార్టీకే ఓటేయమని తన అభిమానులను కోరుతుంటే, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ‘కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్’ అంటూ బీజేపీకే ఓటేయమని కోరుతూ గట్టిగా ప్రచారం చేస్తుండటంతో మెగా అభిమానులకు ఎవరి మాట వినాలో తెలియని ఒక అయోమయ పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మహేష్ బాబు అభిమానులకు కూడా అటువంటి పరిస్థితే ఎదురయింది. కొద్ది రోజుల క్రితం మహేష్ బాబు తన బావగారయిన (తెదేపా గుంటూర్ లోక్ సభ అభ్యర్ధి) గల్లా జయదేవ్ కే తాను మద్దతు ఇస్తున్నానని, తన అభిమానులు కూడా ఆయనకే మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాని ట్వీటర్ మేసేజ్ పెట్టారు.

 

నేడో రేపో మహేష్ బాబు స్వయంగా బావగారు జయదేవ్ కోసం గుంటూరులో ప్రచారం చేసే అవకాశాలున్నాయి. ఇటువంటి సమయంలో సూపర్ స్టార్ కృష్ణ మరియు మహేష్ బాబు అభిమానుల సంఘాల గౌరవాధ్యక్షుడు మరియు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు మీడియాతో మాట్లాడుతూ తమ అభిమాన సంఘాలన్నీ వైకాపాకే మద్దతు ఇవ్వాలని నిశ్చయించుకొన్నాయని ప్రకటించారు. అంతే కాక అవసరమయితే తన సోదరుడు సూపర్ స్టార్ కృష్ణ కూడా వైకాపా తరపున ఎన్నికల ప్రచారం చేస్తారని విస్పష్టంగా ప్రకటించారు. అందుకు బలమయిన కారణమే ఉంది. ఆయన తెదేపా టికెట్ ఆశించి భంగపడిన తరువాత వైకాపాలో చేరి టికెట్ సాధించి తెనాలి నుండి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. కనుక అభిమానులు వైకాపాకే మద్దతు ఈయలని కోరుతున్నారు.


మహేష్ బాబు తేదేపాకు మద్దతు ఇవ్వమని కోరుతుంటే, ఆయన వైకాపాకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం, కృష్ణ కూడా వైకాపా తరపున ప్రచారంలో పాల్గొంటారని ప్రకటించడంతో, ఇప్పుడు మహేష్ బాబు అభిమానులు కూడా మెగా డైలెమాలో పడ్డారు. గల్లా జయదేవ్ గుంటూరు నుండి లోక్ సభకు పోటీ చేస్తున్నందున, ఆయనకు మద్దతు ప్రకటించిన మహేష్ బాబు, నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే, తప్పనిసరిగా ఆ లోక్ సభ నియోజక వర్గం పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నుండి పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్ధులకు ప్రచారం చేయవలసి ఉంటుంది. అటువంటప్పుడు ఆయన తండ్రి కృష్ణ వైకాపా తరపున ప్రచారం చేస్తారా? చేస్తే అప్పుడు తాము ఎవరిని అనుసరించాలి? అనే సందిగ్దత అభిమానులలో నెలకొంది.