మహేశ్ బాబు చింతలకుంట చింతలు తీర్చెనా



మహేశ్ బాబు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా శ్రీమంతుడు అనిపించుకుంటున్నాడు. శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో తను కూడా ఒక ఊరిని దత్తత తీసుకున్నారు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా శ్రీమంతుడు సినిమా చూసి మహేశ్ బాబుని అభినందించి.. ఒక ఊరిని దత్తత తీసుకోవాలని కోరగా.. దానికి మహేశ్ బాబు కూడా అంగీకరించినట్టు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మహేశ్ బాబు పాలమూరు జిల్లాలోని చింతలకుంట గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో చింతలకుంట గామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహేశ్ బాబు తమ గ్రామాన్ని దత్తత తీసుకోవడం వల్ల గ్రామంలో సమస్యలు తీరిపోయినట్టే అని.. చింతకుంటు గ్రామం చింతలు తీరినట్టే అని ఆనందంతో ఉన్నట్టు తెలుస్తోంది.

 

అయితే ఇప్పటి వరకూ అసలు ఈ గ్రామం ఉందని కూడా సరిగా తెలియని నేపథ్యంలో మహేశ్ బాబు ఈ గ్రామం కష్టాలు ఎంత వరకూ తీర్చుతాడో అని అప్పుడే ప్రశ్నలు మొదలవుతున్నాయి. తెలంగాణలోని గద్వాలకు 45 కిలోమీటర్ల దూరం ఈ గ్రామానికి అడుగడుగునా సమస్యలే. మొత్తం 700 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో కనీస సదుపాయాలు కూడా లేవు. మరి మహేశ్ బాబు ఈ గ్రామం చింతలు ఎంత వరకూ తీర్చుతాడో చూడాలి.