రాష్ట్రపతి పాలన వెనుక బీజేపీ వ్యూహం... గవర్నర్ తో టీ20 మ్యాచ్ ఆడించిన కేంద్రం..! 

అనేక మలుపులు తిరిగిన మహారాష్ట్ర రాజకీయం చివరికి రాష్ట్రపతి పాలన విధించడంతో ఎండ్ కార్డ్ పడింది. డెడ్‌లైన్‌లోపు ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ...రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేశారు. గవర్నర్ అలా సిఫార్సు చేశారో లేదో ...కేంద్ర మంత్రిమండలి, ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. అలా, రెండు వారాలకు పైగా సాగిన మహా డ్రామాకు తెరపడింది. అయితే, ఇంత వేగంగా గవర్నర్ నిర్ణయాలు తీసుకోవడం వెనుక బీజేపీ వ్యూహం ఉందనే మాటలు వినిపిస్తున్నాయి.

అసలు ఎన్సీపీకి ఇచ్చిన గడువు ముగియకుండానే గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ కేంద్రానికి నివేదిక ఇచ్చారు. స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాల్లేవని, అందువల్ల రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేశారు. గవర్నర్ నివేదిక మేరకు కేంద్ర కేబినెట్... అనంతరం రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం చకచకా జరిగిపోయాయి. అయితే, బీజేపీకి రోజుల తరబడి సమయమిచ్చిన గవర్నర్.... తాము 48గంటల గడువు కోరినా ఇవ్వలేదంటూ శివసేన సుప్రీంను ఆశ్రయించింది. ప్రభుత్వ ఏర్పాటుకు తాము ప్రయత్నిస్తుండగానే రాష్ట్రపతి పాలన విధించారంటూ మండిపడింది.

అయితే, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడం వెనుక బీజేపీ తెలివిగా పావులు కదిపింది. శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి మొదట్నుంచీ విముఖత చూపుతున్న బీజేపీ... ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా... టీ20 మ్యాచ్ తరహాలో యమ స్పీడ్ గా గవర్నర్ తో గేమ్ ఆడించింది. తమకు దక్కని అధికారం ఎవరికీ దక్కకూడదన్న ఆలోచనతోనే బీజేపీ అలా చేసిందనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిణామాలతో శివసేన ఇరకాటంలో పడిందని అంటున్నారు. శివసేనకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైనా... ఎన్సీపీ 50-50 ఫార్ములాను తెరపైకి తేవడంతోనే... చర్చలు ముందుకి కదల్లేదనే మాట వినిపిస్తోంది.

ఇక, ఆగమేఘాల మీద రాష్ట్రపతి పాలన విధించడంపై శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ మండిపడ్డాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 48గంటల గడువు కోరినా ఇవ్వకుండా రాష్ట్రపతి పాలన విధించారని శివసేన ఫైరవుతోంది. రాష్ట్రపతి పాలనపై బీజేపీ భిన్నంగా స్పందించింది. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడం దురదృష్టకరమన్న ఫడ్నవిస్.... త్వరలో సుస్థిర సర్కారు ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. అయితే, రాష్ట్రపతి పాలన విధించినప్పటికీ... ప్రభుత్వం ఏర్పాటయ్యే పరిస్థితులు అనుకూలంగా ఉంటే... మళ్లీ అవకాశం ఇవ్వొచ్చని న్యాయ నిపుణులు అంటున్నారు.