మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్..! కాంగ్రెస్, ఎన్సీపీకి డిప్యూటీలు

నెలరోజులకుపైగా కొనసాగుతోన్న మహా డ్రామాకు తెరపడింది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన చేస్తోన్న ప్రయత్నాలు దాదాపు కొలిక్కి వచ్చాయి. సంకీర్ణ సర్కారు ఏర్పాటుపై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య జరిగిన చర్చలు సక్సెస్ అయ్యాయి. కనీస ఉమ్మడి ప్రణాళిక, అధికార పంపిణీపై మూడు పార్టీలూ ఒక అవగాహనకి వచ్చాయి. ముఖ్యంగా, శివసేన-ఎన్సీపీలు చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిని పంచుకునేలా.... అలాగే, కాంగ్రెస్‌కు ఐదేళ్లపాటు డిప్యూటీ సీఎం ఇవ్వాలన్న ప్రతిపాదనపై అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది.

ఉమ్మడి ప్రణాళికతోపాటు లౌకిక స్ఫూర్తికి కట్టుబడాలన్న ప్రతిపాదనలపై మూడు పార్టీల మధ్య అవగాహన కుదరడంతో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియరైంది. అయితే, మొదటి టర్మ్‌లో శివసేన నుంచి ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రి పదవి చేపడతారని... అలాగే, కాంగ్రెస్‌ నుంచి బాలాసాహెబ్‌... ఎన్సీపీ నుంచి అజిత్ పవార్‌లు డిప్యూటీ సీఎంలుగా ప్రభుత్వం ఏర్పాటవుతుందని అంటున్నారు. మంత్రి పదవులు పంపకంపైనా దాదాపు క్లారిటీ వచ్చేసింది. 14-14-14 చొప్పున మూడు పార్టీలూ సమానంగా మంత్రి పదవులను పంచుకోనున్నాయి.

శివసేన నుంచి ఉద్ధవ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టనుండగా, కీలకమైన హోం, ఆర్ధిక, రెవెన్యూ, ఇరిగేషన్, పట్టణాభివృద్ధి, పీడబ్ల్యూడీ, ఉన్నత విద్య, గ్రామీణాభివృద్ధి వంటి శాఖలను శివసేన కోరినట్లు తెలుస్తోంది. అయితే, ఈ శాఖలనే కాంగ్రెస్, ఎన్సీపీ కూడా అడుతున్నట్లు చెబుతున్నారు.