మహాకూటమికి 80 స్థానాలు..తెరాసకు 20 స్థానాలు

 

ఎన్నికల ప్రచారాలు ముమ్మరంగా సాగుతున్నవేళ తెరాస,కాంగ్రెస్ పార్టీలు గెలిచేది మేము అంటే మేము అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  ప్రస్తుత సర్వే ప్రకారం మహాకూటమి 80కి పైగా స్థానాల్లో గెలవబోతోందని, తెరాస 20 స్థానాలకే పరిమితమవుతుందన్నారు.ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్సీ భూపతిరెడ్డి అనుచరులను పార్టీలోకి ఆహ్వానించిన ఉత్తమ్ అనంతరం విలేకర్లతో మాట్లాడారు. మహాకూటమిలోని మిత్రపక్షాలతో చర్చలు మంచి వాతావరణంలో జరుగుతున్నాయని, పొత్తులపై ఒకటి రెండురోజుల్లో స్పష్టత వస్తుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక ముసాయిదా సిద్ధమైందన్నారు.మహాకూటమి పేరు మారుతుందని, కూటమిలోని పార్టీలు ఉమ్మడిగానే ప్రచారం చేస్తాయని తెలిపారు. గెలిచే అవకాశం, సామాజిక న్యాయం ప్రాతిపదికనే టికెట్ల కేటాయింపు ఉంటుందన్నారు.12 చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. రెండు సభల్లో సోనియాగాంధీ పాల్గొనే అవకాశం ఉందన్నారు. సీమాంధ్రులు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక ప్రణాళికతో ప్రచారం ఉంటుందని తెలిపారు. కుటుంబానికి ఒకే టికెట్‌ అనే అంశంపై చర్చిస్తున్నారని, ఏఐసీసీ నేతలు దీనిపై త్వరలో నివేదిక ఇస్తారని చెప్పారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వంద రోజుల్లో నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే మెగా డీఎస్సీ నిర్వహించి 20 వేల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని, తొలి ఏడాది లక్ష ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు దాదాపు 10 లక్షలమంది నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. నాలుగేళ్లలో 4,500 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే కనీసం వారి కుటుంబాలను పరామర్శించి సాయం చేయని తెరాస, కేసీఆర్‌ కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమికొట్టి గోరీ కట్టాలని అన్నారు.