మహాకూటమి భేటీ..నేడు ఫైనలా?సెమీఫైనలా?

 

తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్,టీడీపీ,టీజేఎస్,సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.అయితే పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ రోజుకో మలుపు తిరుగుతుంది.రెండు రోజులుగా ఢిల్లీ చుట్టూ తిరిగిన పొత్తుల అంశం ఇప్పుడు హైదరాబాద్‌కు మారింది.హైదరాబాద్‌లో కూటమి నేతలు భేటీ కానున్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు, టీజేఎస్ అధినేత కోదండరాంలు కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీతో సమావేశం అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో నేడు జరగనున్న ఈ భేటీ కీలకం కానుంది. మహాకూటమి ప్రాధాన్యత దృష్ట్యా పొత్తుల అంశాన్ని త్వరగా తేల్చాలని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు రాహుల్‌ ఆదేశించినట్లు తెలిసింది.ఈ ఎన్నికల్లో పొత్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించాల్సిందేనని, ఆ దిశగా సీట్ల సర్దుబాటును వేగంగా కొలిక్కి తేవాలని సూచించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే నేటి భేటీలో భాగస్వామ్య పక్షాలకు ఎన్ని సీట్లు? ఏయే స్థానాలు? అనే అంశాలపై స్పష్టత వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాత్రం 95 స్థానాలు,టీడీపీ కి 14 స్థానాలు,మిగిలినవి టీజేఎస్,సీపీఐల కు అని ప్రకటించింది.సీపీఐ సీట్లను రెండుకే పరిమితం చేస్తున్నారంటూ వస్తున్న ప్రచారంపై ఇప్పటికే ఆ పార్టీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. 7 స్థానాలకు జాబితాను అందజేయగా.. ఇందులో వైరా, బెల్లంపల్లి మాత్రమే ఇస్తామన్నట్లు సంకేతాలు అందడంపై ఆ పార్టీ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మండిపడుతున్నారు.టీజేఎస్ ది కూడా ఇదే పరిస్థితి. మిర్యాలగూడ స్థానాన్ని తమకు కేటాయించాలని టీజేఎస్ నేతలు పట్టుబడుతున్నారు. కానీ కాంగ్రెస్‌ ఇచ్చేలా లేదు.టీజేఎస్ సూత్రప్రాయంగా కనీసం 12 స్థానాలకు అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది.టీడీపీకి 14 సీట్లు కేటాయించినా ఏయే స్థానాలు ఇస్తారనే దానిపై స్పష్టత లేదు. ఆలేరు, నకిరేకల్‌, కోదాడ స్థానాలను టీడీపీ అడుగుతోంది.కానీ ఇవి ఇస్తామని కాంగ్రెస్‌ నుంచి సానుకూలత రావడంలేదని సమాచారం. ఏయే స్థానాలను కేటాయిస్తారనే అంశంపై నేటి భేటీలో చర్చించనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.మరి నేడు జరిగే ఈ భేటీ ఫైనలా లేక ఇంకా సెమిఫైనలేనా అని వేచి చూడాల్సిందే.