తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి శోభ... శివనామ స్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు...

తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి సందడి నెలకొంది. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఏపీ, తెలంగాణలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మార్మోగిపోతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. పరమ శివుడిని దర్శనం చేసుకునేందుకు ఆలయాల ముందు పెద్దఎత్తున బారులు తీరారు.

ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు భక్తులు శ్రీశైలానికి పోటెత్తుతున్నారు. అలాగే, శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగలోని శ్రీముఖలింగేశ్వరస్వామి ఆలయానికి... పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని పంచారామక్షేత్రమైన సోమారామానికి భక్తులు పోటెత్తారు. అదేవిధంగా, పాలకొల్లు పంచారామక్షేత్రం క్షీరరామలింగేశ్వరస్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు.

తెలంగాణలో అతిపెద్ద శైవక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రఖ్యాతిగాంచిన వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. కోడె మొక్కులు తీర్చుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక, ప్రధాన శైవ క్షేత్రాలైన ఉమామహేశ్వరం, జోగులాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలతోపాటు కీసర, ధర్మపురి శివాలయాలకు భక్తులు పోటెత్తారు.

ఇక, మహా శివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్న టెంపుల్‌కు తెలంగాణ పర్యాటకశాఖ హెలికాప్టర్ సర్వీసును ప్రారంభించింది. బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి సేవలు అందుబాటులో ఉండనున్నాయి. భవిష్యత్తులో అన్ని ప్రధాన ఆలయాలకు హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.