నేతాజీ సుభాస్ చంద్రబోస్ బతికే ఉన్నారట...

 

నేతాజీ సుభాస్ చంద్రబోస్ విమానం ఎక్కి గగన వీధుల్లో కనుమరుగైపోవడం ఏమోగానీ, ఇంతకాలం గడిచినా ఆయన ‘చచ్చిపోయాడు’ అని చెప్పే సాహసం ఇండియాలో ఎవరికీ లేకుండా పోయింది. కొంతమంది ఆయన వీరాభిమానులు ఆయన ఇంకా బతికే ఉన్నాడని అనుకుంటూ వుంటారు. సుభాస్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించలేదని, అదృశ్యమైపోయిన తర్వాత 1962లో చైనా యుద్ధంలో పాల్గొన్నాడని, 1964లో జవహర్లాల్ నెహ్రూ అంత్యక్రియల్లో పాల్గొన్నాడని, సాధువుగా మారువేషంతో జీవించాడని, ఇప్పటికీ బతికే వున్నాడని చెప్పుకుంటూ ఆత్మానందాన్ని పొందుతూ వుంటారు. నేతాజీ కనిపిస్తే బ్రిటీష్ వారికి అప్పగిస్తామని అప్పట్లో భారత ప్రభుత్వం హామీ ఇచ్చినందువల్లే ఆయన బయటకి రావడం లేదని కూడా అంటూ వుంటారు. ఈ నేపథ్యంలో చెన్నై హైకోర్టు మదురై బెంచ్‌లో ఒక పిటిషన్ నమోదైంది. చెన్నైకి చెందిన ఒక న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. సుభాష్ చంద్రబోస్ బతికే వున్నాడని, ఆయనని కోర్టు ముందు ప్రవేశపెట్టడానికి సిద్ధంగా వున్నామని తెలిపారు. దాంతో కోర్టు ఈ విషయాన్ని హోంశాఖ కార్యదర్శికి తెలియజేసి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.