అన్నాదమ్ముల సవాల్

 

తమిళనాడులో కరుణానిధి తనయులు అళగిరి, స్టాలిన్ మధ్య విభేదాలు వచ్చి ఇద్దరూ కొట్టుకున్నంత పని చేస్తే, కర్ణాటకలో మరో మాజీ ముఖ్యమంత్రి కుమారులు ఇదే బాట పట్టారు. అయితే తమ తండ్రి, కర్ణాటక మాజీ సీఎం బంగారప్ప చనిపోయిన తర్వాతే ఆయన కొడుకులు మధు బంగారప్ప, కుమార బంగారప్ప కొట్టుకుంటున్నారు. బంగారప్ప కుమారుల మధ్య పోరు తారస్థాయికి చేరుకుంది. ఇప్పటి వరకు ఆరోపణలకే పరిమితమైన మాటల యుద్ధం చివరకు రోడ్డున పడింది. మధు బంగారప్పకు వ్యతిరేకంగా కుమార బంగారప్ప ధర్నాకు దిగడంతో వీరి కలహాలు మరో మలుపు తిరిగాయి. ఈడిగ సమాజం ఆస్తులను మధు బంగారప్ప దుర్వినియోగం చేస్తున్నాడంటూ శివమొగ్గ ప్రాంతంలో ఉన్న గాడికొప్పలోని శరావతి డెంటల్ కళాశాల ఎదుట కుమార బంగారప్ప ధర్నా చేశారు. శరావతి డెంటల్ కాలేజీ ఉన్న స్థలం ఈడిగ సమాజానికి చెందినదని, సమాజ శ్రేయస్సు కోసం ఈ ఆస్తిని అప్పట్లో కేటాయించారని గుర్తు చేశారు. సుమారు 150 ఎకరాల విస్తీర్ణమున్న ఈ స్థలాన్ని 15 ఎకరాలు మాత్రమే ఉందంటూ మధు బంగారప్ప పేర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి సమాజం ఆస్తిని ప్లాట్లుగా విభజించి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బంగారప్ప కొడుకులిద్దరి మధ్య ఎప్పటినుంచో విభేదాలున్నాయి. పదవుల కోసం, అధికారం కోసం వీళ్లిద్దరి మధ్య ఆధిపత్య పోరాటం నడుస్తూనే ఉంది. అయినా, బంగారప్ప ఉన్నన్నాళ్లు అది నివురుగప్పిన నిప్పులా ఉండిపోయిందే తప్ప బయటకు రాలేదు. ఇప్పుడు కాస్తా అది భగ్గుమంటూ కార్చిచ్చులా వ్యాపిస్తోంది.