అమెరికా అధ్యక్ష పీఠంపై బాబీ జిందాల్?

 

అమెరికా అధ్యక్ష పీఠం మీద ఒక భారతీయుడు కూర్చుంటే ఎలా వుంటుంది? ఇంకెలా వుంటుంది? అద్భుతంగా వుంటుంది. ఆ అద్భుతాన్ని సాధించే వ్యక్తి ప్రస్తుత లూసియానా రాష్ట్ర గవర్నర్ బాబీ జిందాల్ ఎందుకు కాకూడదు? అవును.. బాబీ జిందాల్ అవ్వొచ్చన్న అభిప్రాయాలు అమెరికాలో వినిపిస్తున్నాయి. పంజాబ్ రాష్ట్రానికి చెందిన బాబీ జిందాల్ కుటుంబం శతాబ్దాల క్రితం అమెరికాకి వలస వెళ్ళి స్థిరపడింది. బాబీ జిందాల్ రెండుసార్లు లుసియానా రాష్ట్ర గవర్నర్‌గా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2015 వరకు వుంది. 2016 సంవత్సరంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈసారి ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ బాబీ జిందాల్‌ను అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో నిలపాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. బాబీ జిందాల్ ఇమేజ్ కేవలం లుసియానా గవర్నర్ పదవితోనే ఆగిపోలేదు. ఇటీవల జరిపిన సర్వేలో ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి వున్న పదిమంది వ్యక్తుల్లో బాబీ జిందాల్ కూడా ఒకరని తేలింది. రిపబ్లికన్ పార్టీలో కూడా ఎక్కువ శాతం మంది బాబీ జిందాల్‌ను తమ అభ్యర్థిగా నిలబెట్టాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. రాజకీయంగా చూస్తే అమెరికాలో వున్న లక్షలాది మంది భారతీయుల ఓటు బ్యాంకు కూడా బాబీ జిందాల్‌కి అండగా నిలుస్తుంది. ఒక తెలుగువాడు అమెరికా అధ్యక్షుడు అయితే చూడాలని వుంది అని గతంలో ఎన్టీఆర్ అంటే చాలామంది నవ్వారు. ఇప్పుడు ఒక భారతీయుడు అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతకాలం తర్వాత తెలుగువాడు కూడా అమెరికా అధ్యక్షుడు అవుతాడేమో!