నారా లోకేష్ ట్విట్టర్ పోస్ట్: బాబుపాదయాత్రకు ఢిల్లీ గజగజ

 

ఒక వైపు చంద్రబాబు నాయుడు నిరంతరంగా పాదయాత్ర చేసుకుపోతూ, ప్రభుత్వాన్ని, కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలను ప్రజల మద్యనిలబడి మరీ ఎండగడుతుంటే, ఆయన కుమారుడు తన ఇంట్లోంచే ఆ పార్టీలపై ట్విట్టర్ ద్వారా సైబర్ యుద్ధం చేస్తున్నాడు. సంక్షిప్తంగా ఉండే సందేశాలతోనే గుంటూరు మిర్చి అంత ఘాటయిన డైలాగులు పేల్చుతూ అందరి దృష్టినీ ఆకట్టుకొంటున్నాడు. అయితే, ఆ రెండు పార్టీలలో ఇంతవరకు అతనిని ఎదుర్కొనే ‘సైబర్ వీరుడు’ ఇంకా పుట్టినట్లు లేదు. అందువల్ల లోకేష్ ట్వీటర్లో చేసిన విమర్శలకు, ఆ రెండు పార్టీలు మీడియా ముఖంగానో లేకపోతే ప్రజలతో నేరుగానో జవాబు చెప్పుకోవలసివస్తోంది. త్వరలో ఆ రెండు పార్టీలు కూడా లోకేష్ కు ధీటుగా సైబర్ యుద్ధం చేసేందుకు ప్రయత్నం చేసినా చేయవచ్చును.

 

ఇక, విషయానికి వస్తే నారా లోకేష్ మళ్ళీ మరో మారు ట్వీటర్లో కాంగ్రెస్ ను విమర్శిస్తూ సందేశం పెట్టాడు. తన తండ్రి ఇక్కడ చంద్రబాబు పాదయాత్ర చేస్తుంటే, అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉలికులికి పడుతోందని, పాదయాత్ర ప్రకంపనలు ఢిల్లీలో కనిపిస్తున్నాయని వ్రాసాడు. ఇక్కడ తన తండ్రి చంద్రబాబు నాయుడు 1000 కిమీ పాదయాత్ర పూర్తి చేయగానే, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నగదు బదిలీ పధకం మొదలు ప్రకటించిందని, మళ్ళీ ఇప్పుడు 2000 కిమీ. పూర్తిచేయగానే ఋణ మాఫీ అంటోందని ఎద్దేవా చేసాడు.

 

ఒక వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఋణ మాఫీ అసాద్యం, అసంభవం అంటుంటే, మరో పక్క కేంద్రం రుణమాఫీ గురించి మాట్లాడటమే రాజకీయాలలో చురుకుగా ఉండే లోకేష్ వంటి యువకులకు విమర్శించే అవకాశం ఇస్తోందని అని అనుకోవచ్చును.