హల్లో హరీష్, అటెండర్ పోస్టు రెడీ : లోకేష్

 

 

 

ఈ ఏడాది ప్రారంభంలో తన తండ్రి, తెలుగు దేశం అధినేత నారా చంద్ర బాబు నాయుడుఫై టిఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన కామెంట్ కు నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. తెలంగాణా ప్రత్యెక రాష్ట్రానికి అనుకూలంగా చంద్ర బాబుతో చిదంబరానికి లేఖ రాయిస్తే, తెలుగు దేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో అటెండర్ ఉద్యోగం చేస్తానని హరీష్ రావు తెలంగాణా ప్రాంతానికి చెందిన తెలుగు దేశం నేతలకు గత జనవరి 13 న సవాల్ విసిరిన విషయం తెలిసిందే.

 

‘హరీష్, ఎన్టీఆర్ భవన్ లో అటెండర్ పోస్టు విషయంలో మీ నుండి అప్లికేషన్ కోసం ఎదురుచూస్తున్నాం. అలాగే, కెటిఆర్, మీరు రాజీనామా ఎప్పుడు చేస్తారు?’ అని లోకేష్ తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారు.

 

తాజాగా, తెలంగాణాకు అనుకూలమని టిడిపి హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కు లేఖ ఇచ్చిన నేపధ్యంలో లోకేష్ ఈ కామెంట్ చేయడం సంచలనం కలిగించింది. తెలంగాణా రాష్ట్రాన్ని తాము ఎప్పుడూ వ్యతిరేకించలేదని, ఇప్పుడు కూడా ఇదే విషయాన్ని ఈ రోజు జరిగిన అఖిల పక్ష సమావేశంలో చెప్పామని లోకేష్ అన్నారు. ఎన్టిఆర్ ట్రస్ట్ భవన్లో అటెండర్ పోస్టు హరీష్ కోసం రిజర్వ్ చేసి పెట్టామని, ఇక ఆయన అప్లికేషన్ కోసం మాత్రం వేచి చూస్తున్నామని లోకేష్ చురకలంటించారు.

 

అలాగే, చంద్ర బాబు ఇలా చేస్తే తాను తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని టిఆర్ఎస్ నేత కె.తారక రామారావు గత ఫిబ్రవరి 10 న ఓ పత్రికా ప్రకటన ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలకు కూడా లోకేష్ తన ట్విట్టర్ అకౌంట్ లోని అదే కామెంట్ లో తగిన ఘాటు సమాధానం ఇచ్చారు.

 

లోకేష్ తాజా వ్యాఖ్యలకు హరీష్ నుండి ఇంకా ప్రతిస్పందన రాలేదు. అయితే, లోకేష్ ఈ వ్యాఖ్యలు కాస్తంత రాజకీయ అలజడి చేసే అవకాశం ఉందని మాత్రం రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.