మావోల హిట్ లిస్ట్ లో పలువురు ప్రముఖులు..

 

దశాబ్ద కాలంగా మావోల ప్రాభల్యం తగ్గింది అనుకుంటున్న నేపధ్యం లో ఒక్కసారిగా అరకు ఘటనతో రాష్టం ఉలిక్కిపడింది. ప్రజాప్రతినిధుల గుండెల్లో గుబులు మొదలయ్యింది. పోలీస్ యంత్రంగం అప్రమత్తమైంది, ఒకప్పటి మావోల ప్రభావిత గ్రామాలు, అటవీ ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకునేందుకు తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక బృందాలు సైతం రంగంలోకి దిగాయి. నిరంతరం అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజాప్రతినిధులకు సూచనలిచ్చారు. మావోల షెల్టర్‌ జోన్‌గా ప్రసిద్దిగాంచిన నల్లమల దశాబ్దాలపాటు నక్సల్స్‌ బూట్ల చప్పుళ్లు, పోలీసుల కూంబింగుతో అట్టుడికింది. 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మావోలతో చర్చల అనంతరం అణిచేయడంతో వారి కదలికలు తగ్గిపోయాయి. అగ్ర నాయకులు నల్లమలలోనే ఆశ్రయం పొందారనే విషయం గ్రహించిన పోలీసు శాఖ అణువణువు జల్లెడ పట్టింది. ఫలితంగా ఆంధ్రా - ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌ ప్రాంతాలకు తరలివెళ్లారు.

13 ఏళ్ల అనంతరం అరకు హత్యలతో మావోలు తమ ఉనికిని చాటుకున్నారు. ఇన్నాళ్లూ స్వేచ్ఛగా తిరిగిన రాజకీయ నాయకుల్లో అరకు ఘటన వణుకు పుట్టిస్తోంది.మావోల హిట్ లిస్ట్ లో అధికార పక్ష నేతలతో పాటు మాజీ నేతలు పలువురు తదితరులు సహా సుమారు 200 మంది జాబితాలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రజాప్రతినిధులు బయటకు వెళ్లొద్దంటూ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మావోయిస్టుల హిట్‌లి్‌స్టలో విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అయ్యన్నపాత్రుడు, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు, గిడ్డి ఈశ్వరికి భద్రత మరింత పెంచారు. ప్రస్తుతం ఉన్న భద్రత సిబ్బందికి అదనంగా గన్‌మెన్‌ను కేటాయించాలని నిర్ణయించారు. అలాగే... సివిల్‌ డ్రెస్‌లో ఉండి చుట్టుపక్కల పరిస్థితులను గమనించే ‘షాడో టీమ్‌’ను ఏర్పాటు చేయనున్నారు.

అయ్యన్నకు ప్రభుత్వం ఇప్పటికే బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం సమకూర్చింది. వీలైనంత వరకు మారుమూల ప్రాంతాలకు వెళ్లవద్దని అయ్యన్న, ఈశ్వరికి పోలీసులు సూచించారు.వీరితోపాటు అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, ఆయన సోదరుడు వినాయక్‌, గిడ్డి ఈశ్వరి వ్యక్తిగత కార్యదర్శి పోలుపర్తి గోవిందరావు, బీజేపీ నాయకుడు లోకుల గాంధీ, కొయ్యూరు మండలం బూదరాళ్ల మాజీ సర్పంచ్‌ సూరిబాబు, ఇదే మండలానికి చెందిన టీడీపీ నాయకుడు ఎం.ప్రసాద్‌, పెదబయలు మండలాధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీపీ జర్సింగి సూర్యనారాయణ, పెదబయలు మండలం జామిగూడ మాజీ సర్పంచ్‌ సుబ్బారావు, ఇంజిరి మాజీ సర్పంచులు సత్యారావు, కామేశ్వరరావులకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. చింతపల్లి మండలంలో 12 మందిని, జీకే వీధి మండలంలో ఎనిమిది మందిని లక్ష్యంగా చేసుకొని ఇప్పటికే అనేక పర్యాయాలు హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం. ఇంకా ఏజన్సీలోని పలు మండలాలకు చెందిన 110 మంది ఈ జాబితాలో ఉన్నట్టు తెలిసింది.