తివారీ.. ఓ మంచి డాడీ!

 

 

 

రాజ్‌భవన్‌లో రాసలీలలు నడిపిన వృద్ధ జంబూకం ఎన్.డి.తివారీ గుర్తున్నాడుగా! మొన్నటి వరకూ పితృత్వం కేసులో ఇరుక్కుని కోర్టు చుట్టూ తిరిగిన తివారీ, రోహిత్ శేఖర్ అనే కుర్రోడు తన కొడుకే కాదని బల్లగుద్ది మరీ వాదించాడు. డి.ఎన్.ఎ. రిపోర్టులో సదరు పిలగాడు నీ కొడుకేనని తేలిందయ్యాబాబూ అని చెప్పినా తివారీ ఎంతమాత్రం పట్టించుకోకుండా తనకి, రోహిత్ శేఖర్‌కి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేశాడు.

 

రోహిత్ శేఖర్ మాత్రం తక్కువవాడా.. ఎంతైనా తివారీ రక్తం పంచుకుని పుట్టినోడు కదా.. తాను కూడా పట్టు వదలకుండా ప్రయత్నాలు చేశాడు. చివరికి ఈమధ్యే తివారీ కడుపులో వున్న తండ్రి పేగు కదిలింది. రోహిత్ శేఖర్ తన కొడుకేనని బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఇంతకాలం కోర్టులో తాను చేసిన వాదనంతా తూచ్ అని మర్చిపోండని చెప్పేశాడు. ఇదంతా ఇలా వుంటే, ఇప్పుడు రోహిత్ శేఖర్‌ని రాజకీయంగా ఎదిగేలా చేయడానికి తివారీ తహతహలాడిపోతున్నాడు.



ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ పార్లమెంట్ స్థానం నుంచి తానుగానీ, తన కొడుకు గానీ పోటీచేసే అవకాశం వుందని చెబుతున్నాడు. త్వరలో నైనిటాల్‌లో పర్యటించి అక్కడి నుంచి తాను పోటీచేయాలా? తన కొడుకు పోటీ చేయాలా? అని అక్కడి ఓటర్లనే అడిగి తెలుసుకుంటానని, ఓటర్లు చెప్పిన ప్రకారం నడుచుకుంటానని సెలవిస్తున్నాడు. అడుగు తీసి అడుగు వేయడానికి అరగంట టైమ్ తీసుకునే తివారి నైనిటాల్‌లో పర్యటించడం, ప్రజల అభిప్రాయం తెలుసుకోవడం ఇవన్నీ పులిహోర కబుర్లేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.



తన కొడుకుని రాజకీయంగా ప్రమోట్ చేయడానికే తివారీ ఫిక్సయ్యాడని చెబుతున్నారు. అయినా రేపోమాపో అన్నట్టున్న తివారీ పోటీ చేస్తే ఓట్లేయడానికి నైనిటాల్ ఓటర్లు అంత అమాయకులు కాదని అంటున్నారు. లేటుగా ఒప్పుకున్నా తివారీ ఒక మంచి డాడీ అని మెచ్చుకుంటున్నారు. కొడుకుమీద ఇంత ప్రేమ కారిపోతున్నవాడు ఏళ్ళకేళ్ళు వాడు నా కొడుకే కాదంటూ కోర్టు చుట్టూ ఎందుకు తిరిగాడోనని అనుకుంటున్నారు.