పేదవారికి ఉపాధి కల్పిస్తున్న భారతీయ-అమెరికన్ స్త్రీ లైలా జనా

  -కనకదుర్గ-

 

 

 

" పేదరికం నిర్మూలించాలంటే చారిటీ పనులు చేస్తే సరిపోదు పేదవారికి పని కల్పించండి అప్పుడు ఒక్క దేశంలోనే కాదు ప్రపంచంలోని పేదరికం తగ్గడం మొదలుపెడ్తుంది." అంటున్నారు కేవలం 26 ఏళ్ళకే సమాసోర్స్ కంపెనీకి సిఇవో (CEO) గా ఎదిగిన లైలా జనా.  ఇప్పటివరకు ఈ కంపెనీ వేల మందిని పేదరికం నుండి బయటకు లాగి మంచి ఉపాధి కల్పించారు, సాన్ ఫ్రాన్ సిస్కో, కాలిఫోర్నియాలో నివసిస్తున్న అమెరికాలో పుట్టి పెరిగిన భారతీయ వనిత లైలా జనా.



"సమ" అంటే సమానత్వం అని అర్ధం సంస్కృతంలో అందుకని తమ కంపెనీకి "సమాసోర్స్," అని పేరు పెట్టామని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతుంది చిన్న వయసులోనే  బిజినెస్ ప్రపంచంలో ఎన్నో అవార్డ్ లను కైవసం చేసుకున్న లైలా జనా.  సమా సోర్స్ ఒక లాభాపేక్ష లేని సంస్థ (non-profit organization), ఈ సంస్థ ఉద్దేశ్యం ప్రపంచ వ్యాప్తంగా పేదరికాన్ని తగ్గించాలని.  పేద దేశాలనుండి నిరుద్యోగులైన యువతకి, స్త్రీలకు "డిజిటల్ పని" కల్పిస్తున్నది.  సమాసోర్స్ "మైక్రో వర్క్," అనే అంతర్జాల ఆధార మాడల్ పనిని, పెద్ద పెద్ద డిజిటల్ ప్రాజెక్ట్స్ ని చిన్న చిన్నవిభాగాలుగా విడగొట్టి సులువుగా చేసే పనులుగా చేసి వారి ఉద్యోగులతో పూర్తి చేయిస్తారు.  ఈ ఉద్యోగులకు ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాన్ని నేర్పించి వారికి తగిన జీతాలిస్తారు వారు చేసే పనికి.

 

 



సమాసోర్స్ హెడ్ క్వార్టర్స్ సాన్ ఫ్రాన్ సిస్కో, కాలిఫోర్నియాలో వుంది, ఫీల్డ్ ఆఫీసేమో, నైరోభీ, కెన్యాలో వుంటుంది.  ఈ సంస్థ ప్రస్తుతం పది డెలివరీ సర్వీస్ లు హైతీ, కెన్యా, ఇండియా, ఇంకా యుగాండాలో వున్నాయి అంతకు ముందు పాకిస్థాన్, ఘానా, దక్షిణ ఆఫ్రికాలో వీరికోసం పనిచేసిన వుద్యోగస్థులున్నారు.  ఎప్రిల్, 2013 వరకు ఈ సంస్థ 14, 100 మందిని వుద్యోగస్థులగా చేసి వారికి వారి కుటుంబాలకు ఇప్పటివరకు మూడు మిలియన్ల డాలర్లకు పైగా జీతాలిచ్చారు.



సమాసోర్స్ డెలివరీ సెంటర్లు సమాసోర్స్ ద్వారా తయారు చేయబడిన సామాజిక ప్రభావం నియమావళిని పాటించాలి, అవి ఏమిటంటే వచ్చిన లాభాల్లో కనీసం 40% డబ్బుని ఉద్యోగుల ట్రైనింగ్ కి, జీతాలకోసం, సామాజిక కార్యక్రమాల కోసం, ఇంకా ఇంతకుముందు అక్కడి ప్రాంతీయ దారిద్ర్యరేఖ కంటే తక్కువ సంపాదిస్తున్నవారిని ఉద్యోగస్థులుగా నియమించాలి.  సమాసోర్స్ వారు ఆ దేశంలోని పార్టనర్స్ తో కలిసి ఉద్యోగులను నియమించే పని చేస్తారు, ముఖ్యంగా, స్త్రీలు, యువత ఏ రకమైన ట్రైనింగ్, అనుభవం లేనివారు చాలా తక్కువ జీతాల పై బ్రతుకుతున్నవారిని తీసుకుంటారు.



సమాసోర్స్ ఐదు మిలియన్ల డాలర్ల కాంట్రాక్ట్స్ దాదాపు 75 పేరున్న టెక్నాలజీ, డాటా ఫర్మ్స్ తో సంపాదించింది,  వీటిలో ఈబే,(eBay), వాల్ మార్ట్.కామ్, లింకడిన్ లాంటివారున్నారు.  అంతే కాదు ఈ కంపెనీకి ఆర్ధికంగా ఫండ్స్ ఇచ్చిన వారిలో బాగా ముందున్న కంపెనీలు గూగుల్, రాకఫెల్లర్,(Rockfeller), సిస్కో(Cisco), ఫోర్డ్ ఫౌండేషన్స్ వున్నాయి.

 



అసలు ఈ లైలా జనా ఎవరు? ఎక్కడ పుట్టింది? ఏం చదివింది? ఆమెకి సమాసోర్స్ కంపెనీ స్థాపించాలనే ఆలోచన ఎలా వచ్చింది? అనే విషయాలు తెలుసుకుందాం ఇపుడు.



లైలా జనా తల్లి '70 దశకంలో ఇండియా నుండి అమెరికా వెళ్ళింది.  లైలా జనా 9, అక్టోబర్, 1982లో బఫెలో, న్యూ యార్క్ లో జన్మించింది, పెరగడం మాత్రం సాన్ పెడ్రో, కాలిఫోర్నియా సబర్బన్ లో పెరిగింది.  ఆమె కాలిఫోర్నియా అకాడెమీ ఆఫ్ మ్యాథ్ అండ్ సైన్స్ లో చదువుకున్నది.  16 ఏళ్ళ వయసులో స్కాలర్ షిప్ సంపాదించుకుని తల్లి తండ్రులని ఒప్పించి ఘానా దేశంలో ఇంగ్లీష్ నేర్పించడానికి వెళ్ళింది.  తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుని ఆఫ్రికన్ డెవలప్మెంట్ స్టడీస్ అనే విషయంతో 2005లో డిగ్రీ సంపాదించింది.  హార్వర్డ్ లో వున్నప్పుడే ఆమె వరల్డ్ బ్యాంక్ డెవలప్మెంట్ రిసెర్చ్ గ్రూప్ కి పేపర్స్ రాసి తయారు చేసింది అలాగే అశోకా పై సామాజిక ఆర్ధిక హక్కుల గురించి పేపర్స్ సబ్మిట్ చేసింది.  గ్రాడ్యుయేషన్ తర్వాత కట్జెన్ బాక్ (Katzenbach)పార్టనర్స్ దగ్గర మ్యానేజ్మెంట్ కన్సల్టంట్ గా పని చేసింది.  లీలా జనా 2007 లో ఆ ఫర్మ్ వదిలేసింది స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ లో విజిటింగ్ స్కాలర్ గా పని చేయడానికి.



2008లో  ప్రపంచ బ్యాంక్ లో పని చేసినప్పటి, మరియు హార్వర్డ్ లో చదువుకుంటుండగానే మొజాంబిక్, సెనెగల్, రవాండా దేశాల్లో ఫీల్డ్ వర్క్ చేసినప్పుడు కలిగిన స్ఫూర్తితో సమాసోర్స్ ప్రారంభించింది.



లైలా జనా తండ్రి చిన్నప్పటి నుండే పేదరికం, దాని వల్ల ప్రజలు ఎలా బాధ పడ్తున్నారు లాంటి విషయాలు చాలా సున్నితంగా చెపుతుండేవారు.  అప్పటి నుండే ఆమెలో ఒక పట్టుదల వుండేది అది తను ఆఫ్రికాలో పని చేస్తున్నపుడు మరింత ఎక్కువయ్యింది వారికి ఏదైనా చేయాలని.  లైల జనా తల్లి ఒక ఫెమినిస్ట్.  ఆమె కూతురిని చాలా జాగ్రత్తగా పెంచారు.   ఆమె చిన్నప్పుడు అందరూ బార్బీ బొమ్మలతో ఆడుకున్నట్టు ఆడుకోలేదు.  చిన్నప్పటి నుండే ఎంతో ఆత్మస్థయిర్యం, ఆత్మవిశ్వాసంతో పెరిగింది.



లైలా జనా ఒక కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ, "ప్రపంచంలో చదువుకున్న వారి సంఖ్య పెరుగుతుంది.  తక్కువ జీతాలు వచ్చే ఇళ్ళల్లో కూడా చదువుకున్నవారున్నారు, కానీ వారికి పని లేదు, ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాల్లో, అభివృద్ది చెందుతున్న దేశాల్లో.  ఆఫ్రికాలో నేను పని చేస్తున్నపుడు, అక్కడ ఎలక్షన్లు జరగడం ఆ తర్వాత పెద్ద గొడవలు జరగడం చూసి, జనాలు వచ్చిన ఫలితాలతో సంతోషంగా లేరేమో అందుకని గొడవ చేస్తున్నారనుకున్నాను, కానీ ఒక ఇంటర్నెట్ కెఫేలో పని చేస్తున్ననా స్నేహితుడు వారెందుకు గొడవ చేస్తున్నారో చెప్పింది విన్నాక చాలా షాక్ అయ్యాను, చాలా బాధేసింది కూడా.  గొడవ చేస్తే ఒకొక్కరికి ఒక డాలర్ దొరుకుతుంది అందుకని గొడవ పడ్తున్నారని చెప్పాడు.  వారిలో చాలామంది చదువుకుని ఉద్యోగాలు లేక   ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పాడు.  అప్పుడు నాకనిపించింది వారికి పెద్ద ఆస్థులు అంతస్థులు లేకపోవచ్చు.  చిన్న చిన్న మురికివాడల్లో, వూళ్ళల్లో బ్రతుకుతున్నవారి దగ్గర వున్నవి - మెదడు, తెలివి దానికి పని దొరికితే ఎన్ని జీవితాలు బాగు పడతాయో కదా అనిపించింది.  అంతే కాదు పని లేక కొన్ని దేశాల్లో పనిముట్లు వుండాల్సిన చేతుల్లో తుపాకులు, బాంబులు లాంటివి చేరి నేరస్థులుగా కూడా తయారవుతున్నారు.  అందుకే వీరికి కావాల్సింది దయ, జాలి కాదు, వారి మెదళ్ళకి పని కల్పించాలి, అప్పుడే పేదరికాన్ని తగ్గించగలం," అని అంటారు లైలా జనా.



లైలా జనాని ఫాస్ట్ కంపెనీ, 2009లో " సాంకేతిక రంగంలోబాగా ప్రాభల్యంగలస్త్రీలలో ఒకరిగా,"  ("One of The Most Influential Women in Technology)," అనే అవార్డ్ ఇచ్చారు.  2010లో "Prix NetExplorateur," అవార్డ్ ని ఫ్రెంచ్ సెనెట్ నుండి మరియు సమాసోర్స్  సోషల్ ఎంట్రప్రెన్యుర్షిప్ (Social Entrepreneurship)తో కలిసి పని చేసినందుకు "ప్రపంచ సాంకేతిక అవార్డ్,"ని పొందారు.  2012 లో డాటామేషన్ ఆర్టికల్ లో పది మంది స్త్రీలలో సాంకేతిక ప్రపంచానికి కావాల్సినంత సేవలు సమాసోర్స్ ద్వారా చేసినందుకు లైలా జనాని ఒకరిగా ఎన్నిక చేసారు. సమాసోర్స్ సంస్థ ఎన్నో అవార్డ్ లను అందుకుంది, 2012లో "Secretaries Innovation award ని," అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్, హిలరీ క్లింటన్ నుండి అందుకున్నారు మరియు టెంపుల్ టెన్ ఫ్రీఢమ్ అవార్డ్ ని అందుకున్నారు.  బిల్ క్లింటన్ ద్వారా 2012లో Club de Madrid Young Leader అవార్డ్ ని అందుకున్నారు.  Sorel shoe company, ఫాల్ సీజన్ లో లైలా జనాతో కలిసి "Get Your Boots Dirty," అనే ప్రచారాన్ని చేసారు.  వారు చేసిన బూట్స్ వేసుకుని ఎలాంటి కష్టమైన ప్రదేశాలకైనా వెళ్ళి పని విజయవంతంగా చేసుకురావొచ్చు అనే యాడ్ లో యువ బిజినెస్ వుమెన్, సమాసోర్స్ కంపెనీకి CEO గా పని చేస్తున్న లైలా జనా ఈ బూట్స్ వాడుతున్నట్టుగా చూపించారు.  "తను వాళ్ళకి యాడ్ లో పని చేయడం వల్ల రెండు కంపెనీలకు లాభం కల్గుతుందని కేవలం ఆ ఒక్క యాడ్ లో నటించా,"నన్నారు లైలా జనా. 



లైలా జనా సోషల్ ఎన్ట్రప్రున్యుర్షిప్ (Social Entrepreneurship) మరియు టెక్నాలజీకి తరచుగా స్పీకర్ గా వెళుతుంటారు. ప్రపంచ ఆర్ధిక ఫోరం (World Economic Forum) వారు లైలా జనా గారిని ఎంతో మంది "యంగ్ గ్లోబల్ లీడర్స్ లో," ఒకరిగా నిర్దేశించారు.  అంతే కాదు TEDindia, PopTech, మరియు Rainer Amhold ఫెలోషిప్స్ ని స్వీకరించారు.  లైలా జనా గారు ఎటువంటి కాన్ఫరెన్స్ ల్లో నయినా, ఏ దేశంలో జరిగే బిజినెస్ మీటింగ్స్ లో నయినా, టీ.వి, వార్తాపత్రికలలో నయినా ఎంతో ధారాళంగా, అందరికీ ఎంతో సులువుగా అర్ధం అయ్యేలా, తను మాట్లాడిన స్పీచ్ ప్రభావం శ్రోతలపై తప్పకుండా వుంటుంది కూడా.  ఇంత చిన్న వయసులోనే అందరూ ఏం చేయాలా అని తలలు బద్దలు కొట్టుకుంటున్న సమస్యని తనకొచ్చిన ఆలోచనతో ఆచరణలో పెట్టి ఎంతో మంది జీవితాలకి వెలుగునిచ్చి చూపిస్తున్నది మన భారతీయవనిత లైలా జనా.



అమెరికాలో పుట్టి పెరిగినా ఇండియా మరియు, ఆఫ్రికన్ దేశాల్లో పేదరికాన్ని తగ్గించడానికి సమాసోర్స్ ద్వారా ప్రయత్నిస్తూ బిజినెస్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటూ ఎంతోమందికి గౌరవనీయురాలవుతూ, స్ఫూర్తినిస్తూ ముందుకు మున్ముందుకు దూసుకుపోతున్న సమాసోర్స్ CEO, లైలా జనాని చూసి భారతీయులంతా గర్వపడాలి.