పొత్తులకు పైఎత్తులు

 

కాలం కలిసొస్తే .. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఐదేళ్ళకోసారి నిర్వహించే పెజాస్వామ్య కుంభమేళా అంగరంగ వైభవంగా జరుగుద్ది. పరస్పరం కత్తులు దూసుకునే పార్టీలు పొత్తులతో రంగంలోకి దిగుతాయి. చేతిలో చెయ్యేసి కలిసి సాగిన వేర్వేరు పార్టీల నేతలు సై అంటే సై అంటూ ఈవీఎమ్ ఫైట్ కు సిద్ధమవుతారు. గెలుపే పరమావధి.. అధికారమే లక్ష్యంగా పొత్తులు కుదురుతాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. శాశ్వత మిత్రులు ఉండరు అనే ఒక ప్రకటనతో ఓటర్లను ఓదార్చుతారు.

 

ఎవరి గోల వారిదే:

ఎన్నికలకు ముందు ఏదో ఒక పార్టీతో చెట్టాపట్టాలేసుకు తిరిగే లెఫ్ట్ పార్టీలు... ఈసారి మాత్రం లెఫ్ట్... రైట్... అంటూ చెరో దారి చూసుకుంటున్నాయి. తెలంగాణా ఏర్పాటుకు మద్దతు పలికిన సీపీఐ, సమైక్యాంధ్ర నినాదంతో ఉన్న సీపిఎం చెరో దారి వెతుకుంటున్నాయి. అవినీతిపై పోరాడి అలిసిపోయిన సీపీఎం జగన్ తో సెటిల్ అయిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు కామ్రేడ్స్ గుసగుసలాడుకుంటున్నారు. సీపీఐకి సీపిఎం హ్యాండ్ ఇవ్వడంతో కొత్త మిత్రులను వెతికే పనిలో పడింది నారాయణ గ్యాంగ్. తెలుగుదేశంతో వెళ్తే తెలంగాణలో నష్టపోయే పరిస్థితి. అందుకని “ఒంటరినైపోయాను...ఇక ఎన్నికలకు ఎలాగు పోనూ...” అంటూ విషాదంగా పాత పాటను కొత్తగా పాడుకుంటు గులాబీ బాస్ చుట్టూ తిరుగుతున్నారు. ఆయన కనుక దయ తలిస్తే ఈసారికి గండం గట్టెక్కినట్లే అని ఆశగా చూస్తున్నారు. కనీసం కాంగ్రెస్ పార్టీ అయినా తమకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోదా? అని కామ్రేడ్స్ ఆశగా ఎదురు చూస్తున్నారని ఊరంతా ఒకటే పుకార్లు.