డీకే అరుణ వద్దు, లక్ష్మణ్ కే నా ఓటు అంటున్న కిషన్ రెడ్డి!!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రెండో సారి బాధ్యతలు చేపట్టడానికి ఉవ్విళ్లూరుతున్నారు అధ్యక్షుడు లక్ష్మణ్.  ఇందు కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి మధ్య విభేదాలు కూడా వచ్చాయి.లక్ష్మణ్ మరోసారి అధ్యక్ష పీఠం పై కూర్చోడానికి కిషన్ రెడ్డి సహకరించడం లేదనే వార్తలు వినిపించాయి. దీంతో వారిద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. అది కాస్తా పోటా పోటీగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునేంత వరకు వెళ్లింది. 

గత కొంతకాలంగా కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఎడముఖం పెడ ముఖంలా వ్యవహరించారు.అయితే ఇప్పుడు ఈ ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిరింది.వారిద్దరి మధ్య దూరం పెరగటానికి కారణమైన అధ్యక్ష పదవే మళ్లీ కలిపిందంటున్నారు అనుచరులు.రాష్ట్ర అధ్యక్షుడు ఎవరుండాలి అనే అంశంపై అధిష్టానం అభిప్రాయ సేకరణ చేసింది. లక్ష్మణ్ సైతం అధ్యక్ష పదవి కోసం సీరియస్ ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుందనే విషయం పై తన అభిప్రాయాన్ని కిషన్ రెడ్డి తొలుత చెప్పలేదు. ఇదే అదునుగా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన డీకే అరుణ తన ప్రయత్నాలు ముమ్మరం చేయటమేకాక రాంమాధవ్ సైతం ఆమెకు మద్దతు తెలిపారు. దీంతో అధ్యక్ష పీఠం రేసులో లక్ష్మణ్ వెనుకబడ్డారని వార్తలు వచ్చాయి.దీనికి లక్ష్మణ్, కిషన్ రెడ్డి జగ్రత్త పడగా ఇటీవల వారిద్దరు రెండుసార్లు రహస్యంగా భేటీ అయ్యారు. ఒక్కసారి లక్ష్మణ్ ఇంట్లో భేటీ కాగా మరోసారి లకిడీకాపూల్ లోని ఓ ప్రైవేట్ హోటల్లో కలుసుకున్నారు. రాష్ట్ర విభాగానికి కొత్త అధ్యక్షుడి ఎంపిక అంశం పై ప్రధానంగా వారిద్దరు చర్చించుకున్నారని పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు.

రాష్ట్ర అధ్యక్ష పీఠానికి లక్ష్మణతో పాటు డీకే అరుణ పోటిపడ్డారు. ఇప్పుడు లక్ష్మణ్ తో పోటీ పడుతున్న అరుణ భవిష్యత్తులో తనకు పోటీ అవుతారని కిషన్ రెడ్డి భావిస్తున్నారంటున్నారు. ఇదే విషయాన్ని పార్టీ లోని నేతలు కూడా చర్చించుకుంటున్నారు. డీకే అరుణ, కిషన్ రెడ్డి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడమే ప్రధాన కారణం. దీంతో కొత్త అధ్యక్షుడిగా బిజెపిలో ఉన్న పాత కాపులు అయితేనే బెటర్ అని లక్ష్మణ్, కిషన్ రెడ్డి అనుకుని ఒక అండర్ స్టాండింగ్ కు వచ్చారని జనాల్లో చర్చ నడుస్తొంది. కొత్తగా చేరిన వారికి ఈ పదవి దక్కితే అసలుకే ఎసరు వస్తుందనే అభిప్రాయం వ్యక్తం కావడంతో ఇద్దరు ఒక్కటయ్యారు. ఇప్పుడు ఇద్దరు నేతలు కలిసి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటుంటారు. లక్ష్మణ్ కే అధ్యక్ష పదవి దక్కితే తనకు సేఫ్ అని కిషన్ భావించడంతో వీరి మధ్య సఖ్యత కుదిరిందని అంటున్నారు.