నవ్వితే చాలట...

 

 

 

‘‘నవ్వులు నాలుగు విధాల చేటు’’ అనేది పాత సామెత. ‘‘నవ్వు అన్ని విధాల మేలు’’ అనేది నేడు నిరూపించబడ్డ విషయం. అయితే ఆ నవ్వులకే మనం దూరమైపోతున్నాం రోజురోజుకీ. రెండు నెలల పసిపాపగా వున్నప్పుడు రోజుకి 300 సార్లకి పైగా నవ్వుతాం మనం. కానీ, పెరిగేకొద్దీ ఆ నవ్వుల సంఖ్య కొంచెం కొంచెం తగ్గి.. పెళ్ళి, పిల్లలు, ఉద్యోగ బాద్యతల్లో పడ్డాక రోజుకి ఒక్కసారి మనస్పూర్తిగా నవ్వటం కూడా కష్టంగా మారిపోతుంది. దీంతో మనకి మనమే నష్టం చేసుకుంటున్నవాళ్ళం అవుతున్నాం. ఎందుకంటే, నవ్వటం వల్ల శరీరమంతా విశ్రాంతి పొందుతుంది. ఒకసారి మనసారా నవ్వితే కండరాలన్నీ సడలి, మానసిక ఒత్తిడి, శారీరక టెన్షన్ తగ్గిపోతాయి. ఒక్క నిమిషం మనసారా నవ్వినా చాలాు దాని ప్రభావం సుమారు 45 నిమిషాలదాకా మన శరీరంపై నిలుస్తుందట. మరిప్పుడు చెప్పండి. ‘నవ్వు’ తప్పనిసరా.. కాదా?

 

 

మీరు బాగా నవ్వి ఎన్ని రోజులైంది? పోనీ కాస్త నవ్వి ఎన్ని రోజులైంది? గుర్తుకు రావడం లేదు కదూ? మీరే కాదు.. ఈ ప్రశ్న ఎవర్ని అడిగినా ఎవరైనా సరే కాసేపు ఆలోచించాల్సిందే. ఎందుకంటే, మనందరం మన మన బాధ్యతల నిర్వహణలో బిజీగా మారిపోయి ఆ నవ్వుని ఎక్కడో జారవిడుచుకున్నాం. అమూల్యమమైన ఆ సంపద మన దగ్గరుంటే చాలు ప్రపంచంలో దేనినైనా సొంతం చేసుకోగలం మనం. కానీ, దానినే జారవిడుచుకుని, ‘ఎంత సంపాదించినా, ఏమి సాధించినా’ నిజమైన ఆనందం కలగటం లేదని వాపోతున్నాం. నిజానికి నవ్వుల్లో తేలిపోయే వ్యక్తి మనస్సు, శరీరం ఎంతో ఉత్తేజాన్ని పొందుతాయి. కష్టాలు, అసంతృప్తి వంటివి ఎదురైనప్పుడు కూడా స్థిరంగా ఉండగలం. జీవితం పట్ల ఆశావహ దృక్పథాన్ని కలిగి వుంటాం. ఇదంతా కేవలం ‘నవ్వు’ వల్ల సాధ్యమయ్యే అద్భుతం.

నవ్వును మరచిపోయి జీవించటమే రోగాలకు మూలమంటున్నారు మానసిక విశ్లేషకులు. ఎందుకంటే, నవ్వటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి కలిగించే హార్మోన్లు తగ్గిపోతాయి. అలాగే నవ్వినప్పుడు ఆనందానికి కారణమైన సహజసిద్ధమైన రసాయనాలు ‘ఎండార్ఫిన్’ లాంటివి చక్కగా విడుదలవుతాయి. అప్పుడు శరీరం, మనస్సు తేలికయి సంతోషం కలుగుతుంది. అందుకే చూడండి... కడుపారా నవ్విన తరువాత అప్పటి వరకు వున్న బరువేదో దిగిపోయినట్టు అనిపిస్తుంది. సంతోషం ఉరకలు వేస్తుంది. అప్పటి వరకు మనల్ని చిరాకు పెట్టిన విషయాలు కూడా చిన్నవిగా తోస్తాయి. కోపం, విచారం దూరమవుతాయి. ఇదంతా కేవలం ఒక్క నవ్వు వల్లే సాధ్యం.

వ్యాయామం చేసినా, చక్కగా నవ్వినా కలిగే ప్రభావం, ప్రయోజనం ఒకేటనట. మనస్పూర్తిగా నవ్వినప్పుడు మానసిక ఆనందం కలుగుతుంది. ముఖంలో, శరీరంమంతటా కండరాలు బాగా కదులుతాయి. నాడీ స్పందనలు అధికమవుతాయం. రక్త ప్రసరణ వేగవంతమవుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరిగి కణజాలానాకి ఎక్కువగా ఆక్సిజన్ అందుతుందిట. శరీరమంతా ఆ నవ్వు ప్రభావం వుంటుంది. ఒకసారి నవ్వితే పదినిమిషాలు జాగింగ్ చేసిన దానితో సమానం అని తేలింది ఓ పరిశోధనలో. ఈ నవ్వుపై పరిశోధన చేసిన మేరీలాండ్ యూనివర్సిటీ పరిశోధకులు ‘నవ్వు ఉత్తమ ఔషధం అన్న మాట నిజమేనని, అది గుండెలను పదిలంగా వుంచుతుందని’ చెబుతున్నారు.

‘లాఫింగ్ థెరపీ’ అంటే ‘నవ్వు చికిత్స’. తనని భయంకరమైన కేన్సర్ వ్యాధి బారినుంచి కాపాడిందని చెప్పారు న్యూయార్క్ టైమ్స్ మాజీ సంపాదకుడు నార్మన్ కూజిన్స్. కాబట్టి నవ్వు నాలుగు విధాల కాదు.. నాలుగు వేల రకాలుగా మంచిదని నమ్మి తీరాలి. నవ్వటం మొదలుపెట్టాలి. మరి నవ్వటం మొదలుపెడతారు కదూ..! నవ్వడం కష్టమనకండి. ఆ కష్టం కరగాలంటే నవ్వాలి మరి. సో... మీ మనసుని, మెదడుని నవ్వుకి ట్యూన్ చేయండి. ఆరోగ్యంగా, ఆనందంగా వుండండి. సరేనా? కరెక్ట్.. లైఫ్ లాంగ్ అలా నవ్వుతూనే వుండండి.
                                                                                                       

                                                                                                              -రమ ఇరగవరపు