ఆ లాస్ట్ బాల్ కి అర్ధమేమిటో?

 

లోక్ సభలో నిన్న రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశపెట్టగానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారని అందరూ భావించారు. కానీ ఆయన లాస్ట్ బాల్స్ ఇంకా మిగిలే ఉన్నాయని అనడంతో మళ్ళీ ఆ లాస్ట్ బాల్స్ ఎప్పుడు పడతాయి, ఏవిధంగా ఎవరు వేస్తారనే చర్చ మొదలయింది. ఈ ‘లాస్ట్ బాల్స్’ అనేది తెలంగాణా అంశంలాగే అంతుపట్టని ఓ బ్రహ్మపదార్ధంలా మారిందంటే అతిశయోక్తి కాదు. దానికి ఎవరు తోచిన నిర్వచనాలు వారు చెప్పుకొనే సౌలభ్యం కూడా ఉంది. లాస్ట్ బాల్స్ అంటే:

 

1.విభజన బిల్లుని ఆపడానికి ఇంకా చాలా అస్త్రాలున్నాయి.

 

2.రాజీనామా చేయడానికి ఇంకా చాలా సమయం ఉంది.

 

3.కాంగ్రెస్ అధిష్టానంపై కిరణ్ కుమార్ రెడ్డి మరిన్ని విమర్శలు.

 

4. కిరణ్ పదవిలో కొనసాగేందుకు అధిష్టానం మరింత గడువు పొడిగింపు.

 

5. కాంగ్రెస్ రాజకీయ ప్రత్యర్ధులను పక్కదారి పట్టించి, బిల్లుని ఆమోదింపజేయడానికి ఇంకా చాలా మార్గాలున్నాయి.

 

6. కొత్త పార్టీ పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం అనుమతి ఇంకా రావలసి ఉంది.

 

ఇలా ఈ ‘లాస్ట్ బాల్స్’కి ఎవరికి తోచినట్లు వారు ఎన్ని భాష్యాలయిన చెప్పుకోవచ్చును. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు అది విభజన ఆపే అస్త్రాలని భావిస్తే, టీ-కాంగ్రెస్ నేతలు రాజీనామాకు ఇంకా సమయం ఉందని చెపుతున్నట్లు భావిస్తారు. ప్రత్యర్ధ రాజకీయ పార్టీలవారు ఆఖరి మూడు పాయింట్లని లాస్ట్ బాల్స్ గా భావిస్తారు.

 

ఇలా కిరణ్ కుమార్ రెడ్డి ఎవరికి ఏ రూపంలో చూసుకోవాలంటే ఆ రూపంలో దర్శనమిస్తున్నారు. ఆయన కొందరికి అధిష్టానాన్ని సైతం దైర్యంగా ధిక్కరిస్తున్న (సమైక్య) హీరో. మరికొందరికి (తెలంగాణా పాలిట) విలన్, ఇంకొందరికి అధిష్టానానికి విదేయుడయిన సమైక్య ముసుగులో విభజనవాదిగా కనిపిస్తూ అలరిస్తున్నారు. ఆయన తను అధిష్టానానికి అత్యంత విధేయుడయిన అసలు సిసలయిన సమైక్యవాదినని స్వయంగా ప్రకటించుకొంటూ ఉంటారు. దానిని డిల్లీ నుండి దిగ్విజయ్ సింగ్ ఎప్పటికప్పుడు ద్రువీకరిస్తుంటారు.