మా భూములు ఎక్కడ సారు?... ప్రభుత్వం ఇచ్చిన భూమిని కాజేసిన సిద్దిపేట నేత

 

నిరుపేద దళిత మహిళలు వ్యవసాయం చేసుకుని ఆర్థికంగా ఎదగడానికి అప్పటి ప్రభుత్వం వారికి భూమిని పంపిణీ చేసింది. అప్పటి ప్రభుత్వం అంటే దాదాపు 20 ఏళ్ల క్రిందటి ప్రభుత్వం. అందరికి ఎలాగో నడిచింది కానీ అందులో నలుగురు మాత్రం శాపానికి గురైయ్యారు. కష్టం చేసుకుని ఎదగడం దేవుడెరుగు 20 ఏళ్ళ నుంచి వారికిచ్చిన భూమి ఎక్కడుందో వెతకడానికి వారి కళ్లు కాయలు కాస్తున్నాయి. తమ భూమిని తమకు ఇప్పించాలని నాటి నుంచి నేటి వరకు అధికారులు, నాయకుల చుట్టూ ప్రదక్షిణ చేసినప్పటికి కనీసం ఒక గజం భూమి కూడా చూపించలేదు. ఇప్పటికీ వారి భూములు ఎక్కడ ఉన్నాయో తెలియక సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కల్లెపల్లి గ్రామానికి చెందిన దళిత మహిళలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. 

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లెపల్లి గ్రామానికి చెందిన 15 మంది దళిత నిరుపేద మహిళలకు 2000 సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బెజ్జంకి మండల శివారులో 29.22 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఇచ్చిన భూమికి ప్రభుత్వం హద్దుల చూపించింది. అప్పుడు ఇందులో 4 బాధితులు రేఖం సుగుణ, కర్రోళ్ల స్వరూప, దాసరి లక్ష్మీ, బిగుళ్ల ఎల్లవ్వ ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో వ్యవసాయం చేసినట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో ఓ వ్యక్తి తన పలుకుబడితో సదరు భూమిని కబ్జా చేసి తమకు అక్కడ భూమి లేదని చెప్పినట్లు బాధితులు పేర్కొన్నారు. ఇందులో 2018 లో రేకం సుగుణ అనే బాధితురాలు, కుటుంబ సభ్యులు వారికి కేటాయించిన ప్రభుత్వ భూమి దగ్గరికి వెళ్లగా అప్పటికే సదరు భూమిని కబ్జా చేశాడు ఓ పార్టీ నేత. ఆయన కుటుంబ సభ్యులను అప్పటి తహసీల్దార్ సహాయంతో వేధింపులకు గురిచేసినట్లు బాధితురాలు సుగుణ పేర్కొన్నారు. 

తమ భూమి తమకు ఇప్పించాలని సుగుణతో పాటు మిగతా ముగ్గురు బాధితులు అధికారుల చుట్టూ.. కార్యాలయాల చుట్టూ.. ప్రదక్షిణలు చేసినా సెంటు భూమిని కూడా అధికారులు చూపించలేదు. ఇదిలా ఉంటే ఇందులో కొందరికి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జారీ చేసిన కొత్త పాస్ బుక్ లు కూడా వచ్చాయి. తమ భూమిని చూపించాలనీ 4 బాధితులు వేడుకుంటున్నారు. తమ భూమిని ప్రస్తుత అధికార పార్టీ నేత పలుకుబడితో ఆ భూమిని తన కుటుంబ సభ్యుల పేరున మార్చుకున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులు.. నాయకులు దృష్టి సారించి భూమిపై సర్వే చేయించి తమ భూమిని తమకు ఇప్పించాలని వేడుకుంటున్నారు భాదితులు.