ప్లాస్టిక్ సర్జరీతో ఇరకాటంలో పడ్డ ఇరు రాష్ట్రాల పోలీసులు...

 

ఇటీవల కాలంలో ప్లాస్టిక్ సర్జరీలు హల్ చల్ చేస్తున్నాయి. ముఖారవిందం కోసం చేసుకునే ఈ సర్జరీలు దొంగలకు కలిసొస్తున్నాయి. ప్లాస్టిక్ సర్జరీలతో ముఖం మార్చుకోవచ్చన్న టెక్నిక్ ను దొంగలు ఫాలో అవుతున్నారు. ఇటీవల అలాంటి చిన్నపాటి సర్జరీని చేయించుకున్న మురుగన్ కు బాగానే కలిసొచ్చింది. మొత్తానికీ ముఖాన్ని మార్చుకునేయత్నం చేయక పోయినా పోల్చుకో లేకుండా మారిపోవడం అతనికి బాగా కలిసి రావడమే కాక పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. దొంగతనం చేసింది అతనే అని తెలిసినా పట్టుకోలేక పోయారు. దాంతో ఈ మధ్య కాలంలో తనకు అనువుగా మార్చుకున్న ఈ దొంగ ఏకంగా కోర్టులో లొంగిపోయి పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. డబ్బులు ఊరికే రావు, చాలా కష్టపడాలి, దొంగతనము అంతే అదంత ఈజీ కాదని ఈ మురుగన్ చూపించాడు. కొట్టేసిన సొమ్మును పక్కా ప్లాన్ ప్రకారం మార్చేశాడు. చోరీ అయిన మొత్తం బంగారంలో అయిదు కిలోల వరకు పట్టుకున్నా ఇంకా చాలా వరకూ బంగారాన్ని మురుగన్ చేతులు మార్చినట్లు అనుమనిస్తున్నారు. ఇప్పుడు ఆ గోల్డ్ ను రికవరీ చేయడం చెన్నై పోలీసులకు కష్టతరంగా మారింది.  ప్లాస్టిక్ సర్జరీ కారణంగా అతన్ని పట్టుకోవడంలో ఆలస్యం జరిగింది.ఈ లోపే దొంగతనం చేసిన బంగారాన్ని మొత్తం సర్దేశాడు మురుగన్. ఒకప్పటి పాత ఫొటో ఇప్పటి సర్జరీ ఫోటోను చూస్తే ముఖంలో చాలా మార్పులు కనిపిస్తాయి. అప్పుడు బక్కపలచగా అందవిహీనంగా ఉంటే ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ, డెంటల్ సర్జరీతో స్మార్ట్ గా తయారయ్యాడు మురుగన్. అదే అతనికి ప్లస్ అయితే పోలీసలుకు మైనస్ అయ్యింది. ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటూ పోయే మురుగన్ చెన్నైలోని లలిత జూలరీలో దొంగతనం చేశాక అనూహ్యంగా మాయమయ్యాడు.

తన అనుచరుడు ఒకడు పట్టుబడటంతో ఐదు కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు. మిగితా సొత్తును స్వాధీనం చేసుకునే క్రమంలో పోలీసులు ముందుకు సాగుతుండగానే మురుగన్ బెంగళూరు కోర్టులో లొంగిపోవడం సంచలనంగా మారింది. మరో దొంగ సురేష్ తిరువణ్ణామలై జిల్లా చెంగం కోర్టులో లొంగిపోయాడు. ఇప్పుడు మురుగన్ లొంగుబాటు కూడా ఓ వివాదంగా మారింది. అతనిని నుంచి పది కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు తమదంటే తమదంటూ కుస్తీపడుతున్నారు. కర్ణాటక పోలీసులు తమ రాష్ట్రాల్లో జరిగిన దొంగతనాలకు సంబంధించిన గోల్డ్ గా చెబుతుండగా చెన్నై పోలీసులు లేదు లేదు అది ముమ్మాటికీ లలితా జ్యువెలరీ కేసు సొత్తేనని వాదిస్తున్నారు.

ఈ నేపధ్యంలో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య కూడా గోల్డ్ వారు నెలకొంది. తిరుచ్చి జిల్లాలోని తిరువెంబూర్ లో మురుగన్ ఉండే అద్దె ఇంటి సమీపంలో కూడా పోలీసులు అతని ఫోటో పట్టుకొని ఆరా తీశారు. అయినా అక్కడ వారు గుర్తించలేకపోయారు. దీంతో కంగుతిన్న పోలీసులు అసలు విషయం ఆరా తీయగా అతను కొద్దిగా ప్లాస్టిక్ సర్జరీ డెంటల్ సర్జరీ చేయించుకున్నట్లు గుర్తించారు. అంతకుముందు అనారోగ్యంతో ఉన్న అతని ఫోటోకు ఇప్పటి ఫొటోకు చాలా వ్యత్యాసం ఉండడంతో పోలీసులు మొదట గుర్తించలేకపోయారు. చేతి వాటం చూపడంలో మురుగన్ ది అందెవేసిన చెయ్యి. అందుకే అతన్ని పట్టుకోవడం కొన్ని సందర్భాల్లో పోలీసులకు సవాలుగా మారుతూ ఉంటుంది. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం కూడా మరో కారణం ఉందని ప్రచారం ఉంది. అతనికి ఎయిడ్స్ ఉందని, ఆ అనారోగ్యం విషయం బయటివారికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకునే క్రమంలోనే ఇలా చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. 

సినిమాలపై కూడా మురుగన్ కు బాగానే మోజుంది. గతంలో అనేక దొంగతనాలకు పాల్పడిన సొత్తుతో మూడు నాలుగు సినిమాలు కూడా తీశాడు. ఓ హీరోయిన్ తో విదేశాలలో తిరిగాడని అప్పట్లో ప్రచారం సాగింది. ఈ పదిహేనేళ్ల కాలంలో మురుగన్ సంపాదించిన ఆస్తి వంద కోట్ల వరకు ఉంటుందని పోలీసులు లెక్కలే చెబుతున్నాయి. దొంగతనం చేసిన సొత్తులో మెజార్టీ డబ్బును సినిమాల నిర్మాణం కోసమే మురుగన్ ఖర్చు చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు కొంత మంది పేర్లతో బినామీ ఆస్తుల్ని కూడా దాచిపెట్టినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అతనితో  సన్నిహిత్యంగా ఉన్న వారిపైన నిఘా పెట్టారు పోలీసులు. సినిమాలపై మోజుతో తెలుగులోనూ చిన్న చిన్న చిత్రాలకు ఫైనాన్స్ చేశాడు. 

రెండు వేల పదిహేనులో బెంగుళూరులో ఓ వ్యాపార వేత్త ఇంట్లో దొంగతనం చేశాక 3.16 కోట్ల ఆస్తిని రికవరీ చేసేందుకు అక్కడి పోలీసులకు తొంభై రోజుల సమయం పట్టింది. ఆ తరువాతనే మురుగన్ తన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని కొత్త లుక్ తో దొంగతనాలకు తెగబడుతున్నట్లు అర్ధమవుతోంది. మురుగన్ చేసుకున్న ప్లాస్టిక్ సర్జరీతో పోలీసులు బోల్తాపడ్డారు. మురుగన్ ఎపిసోడ్ తో చోరీ తతంగం కాసింత పక్కకు వెళ్లి ప్లాస్టిక్ సర్జరీ మీద డిస్కషన్స్ మొదలయ్యాయి. అసలు ప్లాస్టిక్ సర్జరీతో మొత్తం మొహాన్ని మార్చుకోవడం సాధ్యమవుతుందా సినిమాల్లో చూపించినట్టు జరుగుతుందా ఒకవేళ సాధ్యమైతే ఎన్ని సర్జరీలు చేసుకోవాలి.ఏదేమైనా మున్ముందు సర్జరీలు అంటూ వచ్చే వారి అవసరం ఎంత ఉన్నా వారి వివరాలు ఏంటన్న దానిపై ఆరా తీయాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే సమాజానికి చెడు చేసే దుర్మార్గులకు ఇలాంటి సర్జరీలు కలిసి వచ్చేలా మారుతుండటం మరింత ఇబ్బందికర పరిణామాలకు దారితీసే అవకాశం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. మొత్తానికి ఈ సర్జరీ కారణంగా పోలీసులను ముప్ప తిప్పలు పడుతున్నారనే విషయం వెల్లడవుతోంది.