చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారు.. లక్ష్మీపార్వతి నిరసన

 

కాంగ్రెస్, టీడీపీ పార్టీల మధ్య దోస్తీ కుదురుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలో ఈ రెండు పార్టీలు మహాకూటమితో దగ్గరయ్యాయి. అంతేకాకుండా జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే పనిలో భాగంగా చంద్రబాబు, రాహుల్ గాంధీతో తాజాగా భేటీ అయిన విషయం కూడా తెలిసిందే. అయితే కాంగ్రెస్, టీడీపీల దోస్తీ గురించి ఇతర పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా లక్ష్మీపార్వతి కూడా ఈ దోస్తీని వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిరసన తెలిపారు. కాంగ్రెస్ తో టీడీపి పొత్తు వల్ల ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని, ఎన్టీఆర్ ను చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారని అన్నారు. సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు పార్టీని తాకట్టు పెట్టారని అన్నారు. కాంగ్రెస్ కి వ్యతిరేకంగానే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని.. కాంగ్రెస్ తో టీడీపీ ప్రస్తుత అధ్యక్షుడు చంద్రబాబు పొత్తుకు సిద్ధపడి ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడిచారని లక్ష్మీపార్వతి విమర్శించారు.