లక్ష్మీ పార్వతి అంతర్యం ఏమిటి?

 

రేపు పార్లమెంటు ప్రాంగణంలో స్వర్గీయ యన్టీఆర్ విగ్రహావిష్కరణ జరగనున్న తరుణంలో, తనకు ఆహ్వానం పంపలేదని లక్ష్మీ పార్వతి ఆవేదన చెందడం సహజమే. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా ఆమె స్వర్గీయ యన్టీఆర్ భార్య అనేది ఎవరూ కాదనలేని నిజం. అటువంటప్పుడు ఆమె తన భర్త విగ్రహావిష్కరణకు ఆహ్వానం కోరుకోవడంలో అసహజమేమి కాదు, కానీ దురదృష్టవశాత్తు ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. అందువల్ల ఆమె ఆక్రోశానికి అర్ధం ఉందని చెప్పక తప్పదు. అదేవిధంగా నందమూరి కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఆమెను తమ తల్లి స్థానంలో ఊహించుకోవడానికి ఇష్టపడట్లేదనే సంగతిని వారు మొదటి నుండి కూడా చాలా స్పష్టంగానే తెలియజేస్తున్నారు. అటువంటప్పుడు ఆమె కూడా వారి ప్రసక్తి తేకుండా తన జీవితం గురించి ఆలోచించుకొని ఉండాల్సింది. కానీ, రాజకీయంగా చైతన్య వంతురాలయిన ఆమె తన ఉనికిని కాపాడుకోవాలనే ఆలోచనతో పదేపదే యన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ, ఒకసారి చంద్రబాబు మీద, మరొకసారి నందమూరి కుటుంబ సభ్యుల మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె ఆవిధంగా వ్యవహరించడం వలన మీడియాలో గుర్తింపు పొందగలిగారు కూడా. కానీ, అదే సమయంలో ఆమెను నందమూరి కుటుంభ సభ్యులు మరింత అసహ్యించుకొనేలాచేసింది. ఆ విషయం ఆమె కూడా బాగానే గ్రహించగలిగినప్పటికీ ఆమె తన ఉనికిని కాపాడుకోవాలంటే వేరే దారిలేదు గనుక తన ధోరణిలోతను ముందుకు సాగిపోతున్నారు.

 

నటీనటులు సినిమా జీవితానికి, ప్రజలలో ఒక ప్రత్యేక గుర్తింపుకు అలవాటు పడితే దానికి దూరంగా ఉండలేనట్లే, ప్రజా జీవితానికి అలవాటుపడిన రాజకీయ నాయకులు కూడా, ఏ గుర్తింపుకు నోచుకోని సామాన్య జీవితం ఊహించుకోలేరు. లక్ష్మీ పార్వతి కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే ఉండటంచేత, ఆమె తన ‘యన్టీఆర్ భార్య హోదా’ను పదేపదే ప్రస్తావిస్తూ, నందమూరి కుటుంబ సభ్యులను, చంద్రబాబును తరచూ విమర్శిస్తూ మీడియాను, ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

 

ఆమె సమాజం నుండి గుర్తింపు, గౌరవం ఆశిస్తే, సమాజం తద్విరుద్ధంగా ప్రతిస్పందిస్తోంది. తద్వారా ఆమె తనకు తానూగానే సమాజంలో వ్యతిరేఖభావనలు సృష్టించుకొంటున్నారు. అయితే ఆమె ప్రస్తుతం కనబరుస్తున్న ‘అతిస్పందన’ సమాజంలో ఆమె పట్ల వ్యతిరేఖ భావనలు కలిగిస్తోంది.

 

సోనియా గాంధీకి, మీరా కుమార్ కి, పురందేశ్వరికి తన నిరసన తెలియజేస్తూ లేఖలు వ్రాస్తానని చెప్పిన ఆమె, మళ్ళీ అంతలోనే తనకు రేపటిలోగా ఆహ్వానం పంపకపోతే పురందేశ్వరిని, మీరా కుమార్ ని కోర్టుకు ఈడుస్తానని బెదిరించడం, పురందేశ్వరే స్వయంగా చంద్రబాబు వెనుక ఉంది తన తండ్రికి వెన్నుపోటు పొడిపించిందని ఆరోపానాలు చేయడంతో, ప్రజలకి ఆమె పట్ల కలిగిన సానుభూతి కాస్తా ఆవిరయిపోవడమే కాకుండా ఇప్పుడు విమర్శలు కూడా ఎదుర్కోవలసి వస్తోంది.

 

రాజకీయ చైతన్యవంతురాలయిన ఆమె తదనుగుణంగా పయనిస్తే అప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందగలరు. కానీ ఎల్లకాలం ఇదే సూత్రం నమ్ముకొని ఉనంత కాలం ఆమె పరిస్థితుల్లో కానీ, ఆమె పట్ల సమాజ ప్రతిస్పందనలో గానీ పెద్దగా మార్పులు రావు.