లగడపాటిగారి డ్రామా దేనికొరకు?

 

చంద్రబాబు పాదయాత్ర ఈ రోజు కృష్ణ జిల్లాలో ప్రవేశించబోతున్న తరుణంలో విజయవాడ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వీరంగం ఆడేసి మీడియాలోతెలుగుదేశంపార్టీ గురించీ సమైక్యాంద్ర గురించీ చాలానే మాట్లాడారు. అయితే, తెలంగాణాపై తన కాంగ్రెస్ పార్టీ మరో వారం రోజుల్లో తన నిర్ణయం ప్రకటించబోతుంటే, అయన ఇప్పుడు చంద్రబాబు వెంట ఎందుకుపడుతున్నారు? చంద్రబాబుని ఇప్పుడు సమైక్యాంద్రాకి ఒప్పిస్తే కేంద్రం మళ్ళీ తెలంగాణాను పక్కన బెడుతుందా? కాంగ్రేసుపార్టీలో ఆయనొక్కడే ఎందుకు ఇంత హడావుడి పడిపోతున్నారు? అసలు కాంగ్రెస్ అధిష్టానమే అయన వెనకుండి ఈ డ్రామా అంతా నడిపిస్తోందా?అంతిమంగా దీనివల్ల లాభపడేది ఎవరు, నష్టపోయేవారెవరు? చిన్నగా మొదలయిన ఆయన డ్రామా వెనుక ఇటువంటివి చాలా ప్రశ్నలే ఉన్నాయి.

 

మరొక్క వారం రోజుల్లో రాష్ట్రవిభజనపై ప్రకటన వెలువడనున్న ఈ సమయంలో, ప్రకటన వెలువడక మునుపే, ఇటువంటి డ్రామాతో తెలుగు దేశం పార్టీని ఇబ్బందికరమయిన పరిస్థితుల్లోకి నెట్టి రెండు ప్రాంతాలలో ఆ పార్టీని దెబ్బతీయాలనే ఆలోచన ఒకటి కనిపిస్తుండగా, కేంద్రం సమైక్యాంద్రాకి అనుకూలంగా నిర్ణయం తీసుకొనే ఆలోచన చేస్తుంటే, సీమంద్రాలో ఇటువంటి హంగామా చేయడం ద్వారా వేడిరాజేయగలిగితే ఈ సాకుతో తెలంగాణా ప్రకటనను పక్కనపెట్టేందుకు బలమయిన కారణం కాంగ్రెస్ పార్టీకి దొరుకుతుంది.

 

ఇక, లగాడపాటే ఎందుకు ముందుకు ఉరుకుతున్నారంటే, సమైక్యవాదిగా అయన ఇప్పటికే అందరికీ సుపరిచితుడు గనుక, అయన తన వాదనతో చంద్రబాబుకి అడ్డుపడి గొడవ సృష్టించగలిగితే కాంగ్రెస్ పార్టీకి లాభమే తప్ప కొత్తగా వచ్చే నష్టం ఏమి ఉండదు. అయన చంద్రబాబుని నిలవరించగలిగితే, కోస్తాలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట పెరగడమే గాకుండా, తెలుగు తమ్ముళ్ళ మద్య విభేదాలు పుట్టుకొస్తాయి. చంద్రబాబు నిర్ణయాన్ని సమర్దించేవారు, సమైక్యాంద్రకోసం పార్టీతో విభేదించేవారు రెండువర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈవిధంగా రెండు వర్గాలను సృష్టించగలిగితే, కాగల కార్యం గంధర్వులే చేసినట్లు తెలుగుదేశం పార్టీని వారే కుప్పకూల్చుకొంటారనే ఆలోచనతో లగడపాటి ఈ డ్రామా మొదలుపెట్టి ఉండవచ్చును.

 

ఇక, కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయం ప్రకటించే సమయంలో రాష్ట్రంలో పూర్తీ ప్రశాంతత కోరుకొని ఉంటే, లగడపాటిని ఇంతవరకు వెళ్ళనిచ్చేదికాదు. బహుశః సమైక్యాంద్రాకి అనుకూలంగా నిర్ణయం తీసుకోబోతున్నందునే లగడపాటిని తెరవెనుకనుండి కాంగ్రెస్ అధిష్టానమే ఆడిస్తోందేమో అని అనుమానం ఉంది.

 

ఒకవేళ, కాంగ్రెస్ అధిష్టానంకి ఎటువంటి సంబంధంలేకుండా ఆయన తనంతట తానే ఇదంతా చేస్తుంటే, రాష్ట్రం విడిపోక మునుపే సమైక్యాంద్రా కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడిగా ప్రజలలో మంచిపేరు తెచ్చుకొంటే, ఆనక రాష్ట్రం విడిపోయినప్పుడు కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి పోటీలో అందరికన్నా ముందు తానే ఉండవచ్చుననే ఆలోచనతో ఆయన ఈ హంగామా చేస్తున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.

 

చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా డిల్లీకి పరిగెత్తే కాంగ్రెస్ పెద్దలు, ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానానికి తెలియకుండా, దాని అనుమతి లేకుండా ఈడ్రామా చేస్తున్నారని అనుకోలేము.