లగడపాటి తెలుగుదేశం తీర్థం పుచ్చుకోబోతున్నారా?

 

రాష్ట్రం విడిపోతే ఎన్నికలలో నిలబడనని చెప్పిన లగడపాటి రాజగోపాల్ ఆడినమాట తప్పకుండా ఎన్నికలకు దూరంగా వున్నారు. అయితే సర్వేల స్పెషలిస్టుగా పేరున్న ఆయన సీమాంధ్రలో పోలింగ్ ముగిసిన తర్వాత సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, రాష్ట్రం విడిపోకుండా వుంటే కూడా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుశం, బీజేపీ కూటమి ప్రభుత్వం స్థాపించేదని చెప్పి సంచలనం సృష్టించారు. ఎలాంటి సర్వే అయినా ప్రకటించడానికి వీల్లేదని ఎన్నికల సంఘం నిబంధనలు వున్నప్పటికీ లగడపాటి సాహసంతో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ విషయమై ఎన్నికల సంఘం ఆయన మీద కేసు కూడా పెట్టింది. మొన్నామధ్య లగడపాటి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, తాను రాజకీయాలలో కొనసాగే విషయంలో త్వరలో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. లగడపాటి తీసుకునే ఆ కీలక నిర్ణయం ఏమిటబ్బా అని రాష్ట్ర రాజకీయ వర్గాలలో కలిగిన సందేహాలు శనివారం నాడు కొంతవరకు తీరాయి. లగడపాటి త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈమధ్యే కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో కలసిన గంటా శ్రీనివాసరావుని లగడపాటి విశాఖపట్నంలో కలిశారు. వీరిద్దరి మధ్య కొంతసేపు చర్చలు జరిగాయి. గంటా శ్రీనివాసరావు తనకు సన్నిహితుడు కాబట్టి కలవటానికి వచ్చానని లగడపాటి చెబుతున్నప్పటికీ, ఈ మీటింగ్ లగడపాటి తెలుగుదేశం పార్టీలో చేరడానికి కర్టన్ రైజర్ అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.