గెలుపుపై రమణ ధీమా

 

తెలంగాణలో అటు టీఆర్ఎస్..ఇటు ప్రజకూటమి నేతలు గెలుపు తమదంటే తమదే అంటున్నారు. తాజాగా టీటీడీపీ అధ్యక్షుడు రమణ.. మొత్తం 119 స్థానాలకు గాను తమకు 75 నుంచి 80 స్థానాలు రావొచ్చనే విశ్వాసంతో ఉన్నామని తెలిపారు. ఆయన గోల్కొండ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్‌ నిరంకుశత్వాన్ని తిప్పికొట్టేందుకే తామంతా ఏకమయ్యామని రమణ అన్నారు. పెద్ద ఎత్తున ధనం సమీకరించుకొని కేసీఆర్‌ ముందస్తుకు వెళ్లారని, తెరాస ఎంత ధనం గుప్పించినా ప్రజల అభిప్రాయాలను మార్చలేకపోయిందని ఆరోపించారు. ప్రజల గొంతుకను విన్పించేందుకే తాము కూటమిగా ఏర్పడ్డామని స్పష్టంచేశారు.
 

అధికారులను అడ్డుపెట్టుకొని ఓట్లు తొలగించినా, ఇష్టానుసారంగా ఓటరు లిస్టును తయారు చేసినా.. ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసినా ఓటర్లు చైతన్యంతో ఓట్లు వేశారని అన్నారు. అధికారం కోసం కేసీఆర్‌ వందల కోట్లు వెదజల్లారని ఆరోపించారు. ప్రజా కూటమి ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు అనేకమంది తమతో సహకరించారని చెప్పారు. 86 ఉద్యోగ సంఘాలు తమ వైపు నిలిచాయని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఒక కమిటీని కూడా తాము ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పోలింగ్‌ నాటికి ప్రజా కూటమికి ఆదరణ బాగా పెరిగిందని, కేసీఆర్‌ ఎన్ని రకాలుగా ప్రభావితం చేసినా ప్రజలు కూటమివైపే నిలిచారన్నారు.