ప్రజలంతా ఒక వైపు.. కేసీఆర్‌ కుటుంబం మరో వైపు

 

తెలంగాణలో ఎన్నికల తేదీ దగ్గరపడటంతో మహాకూటమిలోని పార్టీ నేతలు వరుస భేటీలు, చర్చలతో బిజీబిజీగా ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్‌ భ‌ట్టి విక్రమార్క నివాసంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, టీడీపీ సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌ రెడ్డి తదితరులు సమావేశమయ్యారు. కనీస ఉమ్మడి ప్రణాళికపై వీరు చర్చించారు. ఎన్నిక‌ల మేనిఫెస్టోపై కూడా సమీక్షించారు.


కూటమి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక చేయాల్సిన పనులపై ఈ సమావేశంలో చర్చించినట్లు భట్టి తెలిపారు. ప్రజాకూటమిగా తాము అధికారంలోకి వస్తామని ధీమావ్యక్తం చేశారు. కలిసొచ్చే అన్ని పార్టీలు తమకు ముసాయిదా అందించాయని తెలిపారు. రేపు మరోసారి సమావేశమై భాగస్వామ్య పార్టీలతో చర్చిస్తామని భట్టి చెప్పారు. సామాన్యుల అజెండాను కాంగ్రెస్‌ పార్టీకి అందించామని.. అమరులు, ప్రజల పక్షాన ఉమ్మడి అజెండా ఉంటుందని రావుల చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. కనీస ఉమ్మడి ప్రణాళిక అజెండా తయారైందని.. భాగస్వామ్య పార్టీలు ముసాయిదాకు అంగీకరించాయని కోదండరామ్‌ వెల్లడించారు. రేపు దీన్ని అధికారికంగా విడుదల చేస్తామని చెప్పారు. ప్రజలంతా ఒక వైపు.. కేసీఆర్‌ కుటుంబం మరో వైపు ఉందని విమర్శించారు.