ఆయన వస్తున్నాడు..వస్తున్నాడు..వచ్చేసాడు

 

చనిపోయిన వారు ఎలాగు తిరిగి బ్రతికి వచ్చి నిజాలు చెప్పలేరు గనుక వారి పేరున ఎన్ని కబుర్లయినా దైర్యంగా చెప్పేసుకోవచ్చును. అవసరమయిన చోటల్లా వారి పేరుని యదేచ్చగా వాడేసుకోవచ్చును. మహాత్మా గాంధీజీ అంతటి వాడికే ఈ బాధ తప్పలేదు. ఇక అటువంటప్పుడు మాజీ సీయం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి మాత్రం అందుకు అతీతులు కాబోరని ఆయన పుత్రరత్నాలే నిరూపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

 

చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకోవాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి తండ్రిలాగే అమ్మమ్మలు, తాతయ్యలు, అక్కయలు, చెల్లాయిలు అంటూ తెలుగు డిక్షనరీలో ఉన్న బందుత్వాలన్నినీ రోజూ తన సభలలో వల్లే వేసి చివరాఖరున వారికి పేరుపేరునా దండాలంటూ ఇమిటేట్ చేస్తూ, తండ్రిలాగే 108 అంభులెన్స్ కుయ్యికుయ్యిమని ఎలా వస్తుందో చెపుతూ ప్రజలను రంజింపజేస్తున్నారు.

 

ఆయన సంక్షేమ పధకాలన్నిటినీ జగన్ తన పద్దులో వ్రాసేసుకొన్నపటికీ, ఆయన తన కోసం భద్రంగా దాచి ఉంచిన వందల కోట్ల విలువ చేసే టైటానియం లంకె బిందెలని మాత్రం క్లెయిం చేసుకోవడానికి ఎందుకో వెనుకంజ వేస్తున్నారు. కానీ జగన్ అంగీకరించినా, లేకున్నా ఆ నిధులన్నీ ఖచ్చితంగా ఆయనవేనని చంద్రబాబు బల్ల గుద్ధి మరీ వాదిస్తున్నారు.

 

అయితే తన తండ్రి దాచిపెట్టిన ‘టైటానియం నిధులున్నలంకె బిందెలు సరిగ్గా ఎన్నికల సమయంలో దొరికినందుకు జగన్ సంతోషించక పోగా బయటకు చెప్పుకోలేని ఏదో బాధతో కుమిలిపోతున్నాడు.

 

“యస్! వైయస్స్ ఆత్మని, అంతరాత్మని, పరామాత్మని... అన్నీ నేనే..సర్వం నేనే...అదిగో నా తల మీద ఆయనే ఉన్నాడు చూడండి...” అని కేవీపీ రామచంద్ర రావు సగర్వంగా మీడియా ముందు నిలబడి చెప్పిన ఆ నాలుగు ముక్కలే బహుశః జగన్మోహన్ రెడ్డికి ములుకుల్లా గుచ్చుకొని బాధిస్తూ ఉండవచ్చును.

 

ఏమయినప్పటికీ గత రెండు మూడు వారాలుగా అన్ని టీవీ ఛానేళ్ళలో “ఆయన వస్తున్నాడు..ఆయన వస్తున్నాడు..”అనే వైకాపా ప్రకటనలు చూస్తున్న ప్రత్యర్ధ పార్టీల వాళ్ళందరూ కూడా యస్! వైయస్స్ నిజంగానే ఇప్పుడు తిరిగి వచ్చేసినట్లే ఉందని  కుళ్ళు జోకులు వేసుకొని పకపకా నవ్వుకొంటున్నారుట.