బంతిని అమెరికా కోర్టులో పడేసిన కేవీపీ

 

దొరికితే దొంగలు, లేకుంటే దొరలూ..అనే సామెత ఊరకనే పుట్టుకు రాలేదు. మన రాజకీయ నాయకులలో చాలా మందికి ఈ సూక్తి చక్కగా సరిపోతుంది. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి జమానా ఒక స్వర్ణ యుగమని వైకాపా నేతలు ఎంతయినా టాంటాం చేసుకోవచ్చు గాక, కానీ ఆ జమానాలోనే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు కనీవినీ ఎరుగని రీతిలో, స్థాయిలో అనేక కుంభకోణాలు చాప క్రింద నీరులా పరుచుకుపోయాయి. కానీ రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్నంతకాలం అవేమీ బయటకు పొక్కలేదు గనుక, ఆయన ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాల కారణంగా ఆయన ప్రజల అభిమానం పొందగలిగారు. కానీ ఆయన అకస్మాత్తుగా మరణించడంతో ఆ కుంభకోణాలను ఇక ఎంతమాత్రం కప్పిపుచ్చలేని పరిస్థితులు ఎదురువడంతో పాముల పుట్టలోనుండి పాములు బయటపడుతున్నట్లు ఆ కుంభకోణాలన్నీ ఒకటొకటిగా వెలుగు చూస్తుంటే, మంత్రులు, ప్రభుత్వాధికారులు, వ్యాపారవేత్తలు అనేకమంది జైలు పాలయ్యారు. చివరికి అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళాక తప్పలేదు.

 

కానీ ఏదో మంత్రం చదివిది మాయ జరిగినట్లుగా అకస్మాత్తుగా జగన్, అతనితో పాటు మిగిలిన ముద్దాయిలు అందరూ కూడా ఎలాగ లోపలకి వెళ్ళేరో అలాగే బయటకు కూడా రాగలిగారు. ఆయనపై సీబీఐ మోపిన అభియోగాలు కూడా ఎవరో మంత్రం వేసినట్లు అన్నీ అటకెక్కిపోయాయి. దానితో కధ కంచికి జగన్ ఎన్నికలకి సిద్దమయిపోయారు. కానీ, వైయస్సార్ జమానాలో జరిగిన కుంభకోణాలు రాష్ట్రాలు, సప్త సముద్రాలు దాటుకొని విదేశాలకు విస్తరించడంతో, ఇక్కడ అందరినీ మేనేజ్ చేయగలిగినా, బయట దేశాలలో మేనేజ్ చేయడం కుదరకపోవడంతో టైటానియం గనుల కుంభకోణం ఈరోజు బయటపడింది.

 

ఏడాదికి దాదాపు 500 మిలియన్ డాలర్ల విలువచేసే ఖనిజ సంపద త్రవ్వేసుకొని అమ్రెఇకాలొని ఒక సంస్థకు ఎగుమతి చేసుకోవడానికి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డికి ఆత్మగా చెప్పుకొనే కేవీపీ రామచంద్ర రావు డైరెక్షన్లో 2006లో వ్యవహారం మొదలయింది. ఈ లక్షల కోట్ల వ్యవహారంలో ఎక్కడా ఆటంకాలు కలగకుండా ఉండేందుకు ఏప్రిల్ 28, 2006 నుండి జూలై 13, 2010వరకు విదేశాల నుండి దాదాపు 10.59 మిలియన్ డాలర్ల సొమ్ము డిల్లీ నుండి గల్లీ వరకు వివిధ ప్రభుత్వాధికారుల, రాజకీయ నేతల ఖాతాలలోకి వరదలా వచ్చిచేరింది. ఈవిషయాన్ని స్వయంగా అమెరికా షికాగో కోర్టు, ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న అమెరికా పోలీసు అధికారులే దృవీకరించారు. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి కేవీపీ రామచంద్రరావని కూడా దృవీకరించారు.

 

అయితే, మన దేశంలో ఎటువంటి వ్యవహారం కోసమైనా లేదా ఏ అంశంపైనైనా రాజకీయ నేతలు ప్రతిస్పందించేందుకు కొన్ని పడికట్టు స్టేట్మెంట్లు తయారు చేసుకొన్నాము. కనుక కేవీపీ కూడా నీటుగా అదే ఫార్ములా ఫాలో అయిపోతూ “తనపై ఇలాంటి ఆరోపణలు రావడం చాలా దురదృష్టకరమని అన్నారు. ఇప్పటిదాకా తనకు ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు. కేవలం పేపర్లలో వచ్చిన వార్తలను పట్టుకొని తనను దోషిగా తేల్చేయడం సబబు కాదని, తానే పాపం ఎరుగనని అన్నారు. అమెరికా న్యాయ స్థానం లేదా సదరు దర్యాప్తు సంస్థ ఏదయినా నివేదిక ఇస్తే అప్పుడు మాట్లాడతానని’ చెప్పవలసిన నాలుగు ముక్కలు పద్దతిగా చెప్పేశారు. అందువల్ల ఇపుడు బంతి అమెరికా కోర్టులో పడేసినట్లే. కానీ నిప్పులేనిదే పొగ రాదని, మన జనాలకే కాదు అమెరికా కోర్టులకి కూడా బాగానే తెలుసు.

 

అయితే మళ్ళీ ఆ బంతి అణుబాంబులా ఎప్పుడు, ఎవరి మీద పడుతుందో తెలియక, ఈ వ్యవహారంలో బ్యాంకులు నింపుకొన్న వారందరికీ ముచ్చెమటలు పడుతున్నాయి. వారి సంగతెలా ఉన్నపటికీ, సరిగ్గా ఎన్నికల సమయంలో బయటపడిన ఈ భారీ కుంభకోణం తెదేపా అధినేత చంద్రబాబు చేతికి ఏకే-47 రైఫిల్లా దొరికింది. అధిపట్టుకొని అటు కాంగ్రెస్ పార్టీని, ఇటు వైకాపాను, తన ప్రియ శత్రువు జగన్మోహన్ రెడ్డిని కూడా ఒకేసారి చీల్చి చెండాడడం ఖాయం.