ఏపీలో పరిస్థితులు చంద్రబాబుకి అనుకూలంగా లేవు

 

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌‌గా నియమితులైన కేటీఆర్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ సీఎం చంద్రబాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జాతీయ స్థాయి నేత కాదని అన్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ఫ్రంట్‌ పేరుతో హడావుడి చేస్తున్నారని విమర్శించారు. బీజేపీని బూచిగా చూపి టీడీపీని బలపర్చుకోవాలన్నది చంద్రబాబు ప్రయత్నమని ఆరోపించారు. కేసీఆర్ దేశరాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు కోసం పనిచేస్తుంటే.. చంద్రబాబు మాత్రం దేశం కోసం కాకుండా తెలుగుదేశం కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు కాంగ్రెస్‌ వైపు ఉన్నారని.. అయితే కాంగ్రెస్‌, బీజేపీకి సంబంధంలేని ఫ్రంట్‌ మాది అని కేటీఆర్‌ చెప్పుకొచ్చారు. జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయం ప్రాంతీయ పార్టీలేనని.. పార్టీలన్నింటినీ ఏకం చేస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ అడుగుపెట్టబోతోంది కనుక ఏపీ కూడా దేశంలో అంతర్భాగం కనుక అక్కడ కూడా తమ జోక్యం కచ్చితంగా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితులు చూస్తే చంద్రబాబుకు అనుకూలంగా లేవని.. ఏపీలో ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా చాలా బలంగా ఉన్నాయని అన్నారు. అక్కడి రాజకీయాలు అనూహ్యంగా మారతున్నాయన్నారు.