గాంధీ భవనా? లేక గాంధీ ఆస్పత్రా?

 

మహాకూటమి అభ్యర్థుల ప్రకటనలో జాప్యంపై తెరాస నేత కేటీఆర్‌ సెటైర్లు వేశారు.‘‘మహాకూటమి కిందా మీదా పడుతోంది. నిన్న కష్టపడి అర్ధరాత్రి అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. పొద్దున్న జాబితా విడుదల చేస్తే ఎవరు తలుపులు పగలగొడతారో, ఎవరు గాంధీభవన్‌ను పగలగొడతారో అనే భయంతో అర్ధరాత్రి 11 గంటల తర్వాత జాబితా విడుదల చేశారు. అప్పట్నుంచి కాంగ్రెస్‌లో లొల్లి షురూ అయింది. ఇటీవల నేనో ఫొటో చూశాను. గాంధీభవన్‌లో ధర్నాలు జరుగుతుంటే అక్కడ సెలైన్లు పెట్టుకున్నారు. నాకో సందేహం వచ్చింది.. అది గాంధీ భవనా? గాంధీ ఆస్పత్రా అని. సీట్లు కూడా ఒకరికొకరు పంచుకొనే పరిస్థితి లేదు. అలాంటోళ్లు రేపు ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తారో ప్రజలే ఆలోచించాలి" అని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లోని జలవిహార్‌లో దివ్యాంగుల పెన్షనర్ల కృతజ్ఞత సభలో మాట్లాడిన కేటీఆర్‌.. దివ్యాంగులకు సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా అండగా ఉన్నారని తెలిపారు.టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత దివ్యాంగుల పెన్షన్‌ను రూ. 1500కు పెంచిందన్నారు. డిసెంబర్ 11న మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దివ్యాంగుల పెన్షన్‌ను రూ. 3016కు పెంచుతామని స్పష్టం చేశారు.రాష్ట్రంలో మొత్తం 4.90 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారని, వీరందరికి నెలకు రూ. 1500 చొప్పున రూ. 880 కోట్లను దివ్యాంగులకు ఇస్తున్నామని స్పష్టం చేశారు. దివ్యాంగులను పెండ్లి చేసుకున్న వారికి రూ. లక్ష చొప్పున ప్రోత్సాహకం ఇస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్‌ను దివ్యాంగులకు కల్పించామన్నారు. డబుల్ బెడ్‌రూం ఇండ్లలో 5 శాతం దివ్యాంగులకు ఇస్తామని తెలిపారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఐటీ పార్కులు, ప్రతి జిల్లాలో దివ్యాంగుల కోసం ప్రత్యేక భవనాలు నిర్మిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.